మహిళలపై వివక్ష పోవాలి

మహిళలపై వివక్ష పోయి సమానత్వం సాధించేందుకు

మహిళా పోలీసులతో ఎస్‌పి రాధిక

ఎస్‌పి రాధిక

ప్రజాశక్తి- శ్రీకాకుళం

మహిళలపై వివక్ష పోయి సమానత్వం సాధించేందుకు అంతా కృషి చేయాలని ఎస్‌పి జి.ఆర్‌.రాధిక అన్నారు. నగరంలోని ఓ ప్రయివేటు కళ్యాణ మండపంలో జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యాన శుక్రవారం అంతర్జాతీ య మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశిష్ట అతిథులుగా ఎస్‌పితో పాటు నగర కార్పొరేషన్‌ కమిషనర్‌ తమీమ్‌ అన్సారీయా, ఎస్‌పి మాతృమూర్తి, జిల్లా జడ్జి సతీమణి పి.షబాణా అజ్మీ, డాక్టర్లు విశిష్ట అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్‌పి జి.ఆర్‌.రాధిక మాట్లాడుతూ ఉద్యోగస్తులైన మహిళలకు ప్రోత్సాహాన్ని అందిస్తే మరిన్ని విజయాలు సాధించడానికి అవకాశం కలుగుతుందని అన్నారు. ప్రస్తుతం పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, అలాంటప్పుడు వ్యక్తిత్వానికి భంగం కలగకుండా ప్రతి మహిళా స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకగలిగే ధైర్యాన్ని సంపాదించుకోవాలని అన్నారు. చదువుకున్న పిల్లలపై తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకురావద్దని, చదువుతోపాటు జ్ఞానాన్ని పెంపొందించేలా వారిని సమర్ధించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎక్కువగా సైబర్‌ నేరాలు జరుగుతున్నాయని, మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్‌ నేరగాళ్లు ఉచ్చులో పడకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రతి మహిళా ఫోన్‌లో దిశ యాప్‌ ఉంటే ఆపద సమయంలో పోలీస్‌ సహాయ, సహకారాలు పొందగలమని అన్నారు. మార్చి 8 ఒక్క రోజుతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముగిసింది కాదని, రోజూ మహిళా దినోత్సవంగా భావించాలని అన్నారు. ఎంతో మంది త్యాగ ఫతితంగా వచ్చిన మహిళ సమాన హక్కును అందరూ వినియోగించుకోని అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. అనంతరం మహిళలు ఎస్‌పిని దుశ్శాలువతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. అలాగే ఎస్‌పి విశిష్ట అతిథులను సన్మానించారు.

 

➡️