మాతాశిశు మరణాల నివారణకు చర్యలు

మాతా శిశు మరణాల నివారణకు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

  • కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

మాతా శిశు మరణాల నివారణకు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మాతాశిశు మరణాలకు ఆస్కారం లేని విధంగా వైద్యారోగ్య, స్త్రీ,శిశుసంక్షేమ శాఖల సిబ్బంది పనిచేయాలని సూచించారు. వైద్యాధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పూర్తిస్థాయిలో సేవలు అందించాలన్నారు. ప్రభుత్వాస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గర్భిణుల వివరాలను నమోదు చేసుకుని ప్రభుత్వాస్పత్రిలో ప్రసవాల కోసం ప్రోత్సహించాలన్నారు. అవసరమైన పరీక్షలను నిర్వహిస్తూ సుఖ ప్రసవమయ్యే విధంగా వైద్యాధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా వైద్యాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. గర్భిణుల ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రక్తహీనత సమస్య లేకుండా అవసరమైన మందులు అందించాలని సూచించారు. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి నవంబరు వరకు సంభవించిన 70 మాతాశిశు మరణాలపై సంబంధిత వైద్య పరీక్షల నివేదికలు, పోస్టుమార్టం రిపోర్టును క్షుణ్ణంగా తనిఖీ చేసి మరణాలు సంభవించడానికి గల కారణాలపై సమీక్షించారు. గుప్పెడుపేట, రెంటికోట, రట్టిలో గర్భిణుల మృతిపై విచారణ చేపట్టిన అనంతరం పలువురుకి షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి, ఎడిఎంహెచ్‌ఒ అనురాధ, డిసిహెచ్‌ఎస్‌ భాస్కరరావు, ఐసిడిఎస్‌ పీడీ బి.శాంతిశ్రీ, వైద్యులు, ఎఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.

 

➡️