రైతు బ(బే)జారు!

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీపై పలాస, మందస, కోటబొమ్మాళి, టెక్కలి, వజ్రపుకొత్తూరు, నందిగాం, మెలియాపుట్టి మండలాలకు చెందిన వందలాది

రైతుబజారు నిర్మాణానికి కేటాయించిన స్థలం

తాత్కాలికంగా ఏర్పాటు చేసినా కనుమరుగు

బస్టాండ్‌, రోడ్లపై వ్యాపారాలు చేస్తున్న రైతులు

స్థల వివాదంతో ఆగిన నిర్మాణం

జిల్లాలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ ఒకటి. ఈ ప్రాంతంలో రైతుబజార్‌ ఏర్పాటు చేయాలని ఇక్కడ ప్రజల చిరకాల కోరిక. పాలకులు, అధికారుల అలసత్వం ఒక వైపు అయితే మరో వైపు స్థల వివాదంతో నిర్మాణం బేజారు గా మారింది. తాత్కాలికంగా రైతు బజార్‌ ఏర్పాటుకు మంత్రి ప్రారంభించినప్పటికీ కొద్ది రోజులకే కనుమరుగైంది.

ప్రజాశక్తి- పలాస

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీపై పలాస, మందస, కోటబొమ్మాళి, టెక్కలి, వజ్రపుకొత్తూరు, నందిగాం, మెలియాపుట్టి మండలాలకు చెందిన వందలాది గ్రామాల ప్రజలు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆయా మండలాల్లో పండిస్తున్న కూరగాయలు, పళ్లు, చిరుధాన్యాలను పలాస-కాశీబుగ్గ తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. వాస్తవానికి రైతుబజార్‌ అవసరం. రైతుబజార్‌ లేకపోవడంతో కాశీబుగ్గ బస్టాండ్‌, మూడు రోడ్ల కూడలి, కెటి రోడ్డు పక్కల పెట్టుకుంటూ వ్యాపారం సాగిస్తున్నారు. ఉద్దానం ప్రాంతంలో పండిస్తున్న కూరగాయలు, పళ్లు, చిరుధాన్యాలను తక్కువ ధరలకే అమ్ముకుంటూ తీవ్రంగా నష్టపోతున్నామని ఆయా ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుబజారు ఉంటే ఇటువంటి పరిస్థితి ఉండేది కాదని వాపోతున్నారు. మరోవైపు తీసుకొచ్చిన తక్కువ సామాన్యులపై మున్సిపాలిటీ పన్నులు వేస్తూ అధిక భారాన్ని మోపుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపైనే వ్యాపారాలుపలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తున్న రైతులు రైతుబజార్‌ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుబజార్‌ లేక రైతుల అవస్థలు పడుతున్నారని వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో పశుసంవర్థకశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు కాశిబుగ్గ మూడు రోడ్ల కూడలి సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలికంగా రైతుబజార్‌ ప్రారంభించారు. కొద్దిరోజులకే కనుమరుగుకావడంతో యథావిథిగా మరలా బస్టాండ్‌ ఆవరణలో రోడ్లపై కూర్చుని వ్యాపారం చేసే పరిస్థితి నెలకొంది. పాలకులు అధికారులు పూర్తిస్థాయిలో చొరవ చూపక పోవడం వల్లే ఈ ప్రాంతంలో రైతుబజార్‌ ఏర్పాటుకు నోచుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. సర్దుమణగని స్థల వివాదంపలాస కాశీబుగ్గ మున్సిపాలిటీకి రైతుబజార్‌ అవసరం. పలాస కాశీబుగ్గ జంట పట్టణాలపై వందలాది గ్రామాలు ఆధారపడి వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రైతులకు అండగా నిలవాలని పట్టణ ప్రజలకు తక్కువ ధరతో కూరగాయలు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో అప్పటి టిడిపి ప్రభుత్వం కాశీబుగ్గ న్యూ కాలనీ సమీపంలో కాశీబుగ్గ రెవెన్యూ పరిధిలో 207/2బి సర్వే నంబరులో సోషల్‌ వెల్ఫేర్‌కు చెందిన 27 సెంట్లు స్థలాన్ని కేటాయించారు. అనంతరం రూ.40 లక్షలు మంజూరు చేశారు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో చాలా ఏళ్ల నుంచి చిన్నచిన్న దుకాణాలు పెట్టుకుంటూ జీవనం సాగిస్తుండడంతో స్థల వివాదం ప్రారంభమైంది. అప్పటి నుంచి నేటివరకు స్థల వివాదం సద్దుమణకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా రైతు బజార్‌ నిర్మాణం తయారైంది. ఇప్పటికైనా అధికారులు, పాలకులు చాలా చూపి రైతుబజార్‌ నిర్మాణం కోసం కృషి చేయాలని పట్టణ ప్రజలతో పాటు ఇతర ప్రాంత ప్రజలు రైతులు కోరుతున్నారు.ఈ విషయంపై తలగాన వాణి ప్రసన్నకు వివరణ కోరగా, స్థలం కోర్టు కేసులో ఉందని, మంజూరైన నిధులు రూ.40 లక్షలు వెనుకకు తిరిగి వెళ్లి పోయాయని చెప్పారు. స్థల వివాదం సద్దుమణిగిన వెంటనే నిధులు మంజూరు చేయించి రైతుబజార్‌ నిర్మిస్తామని తెలిపారు.

 

➡️