సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడకుండా నిర్లక్ష్యం చేస్తూ ఇబ్బందులకు గురి చేసి సమ్మెకు ప్రభుత్వమే ప్రేరేపించడం

మట్లాడుతున్న ఎమ్మెల్సీ రఘువర్మ

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువర్మ

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడకుండా నిర్లక్ష్యం చేస్తూ ఇబ్బందులకు గురి చేసి సమ్మెకు ప్రభుత్వమే ప్రేరేపించడం తగదని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో జ్యోతిరావు పూలే పార్కు వద్ద సమగ్రశిక్ష కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు చేపట్టిన ధర్నా శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ఉద్యోగులనుద్దేశించి మాట్లాడుతూ ఉద్యోగులందరూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 26వేల మంది సమ్మెలోకి వెళ్లాల్సిన పరిస్థితి ప్రభుత్వమే కల్పించిందని విమర్శించారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యా శాఖలో విలీనం చేసి, రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులందరికి హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. కనీస అవసరాలైన ఇపిఎఫ్‌, ఇఎస్‌ఐ అమలు చేయకుండా ఏళ్ల తరబడి పని చేయించుకుంటున్నారన్నారు. ప్రధానంగా ఉద్యోగులు అడుగుతున్న న్యాయసమ్మతమైన సమస్యలను పరిష్కరించడంలో పట్టనట్టు వ్యవహరించడం తగదన్నారు. ఫ్యాప్టో చైర్మన్‌ మజ్జి మధన్‌మోహన్‌ మాట్లాడుతూ వేతనంతో కూడిన మెడికల్‌ లీవులు మంజూరు చేయాలని, మెరుగైన హెల్త్‌ స్కీం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులతో పాటు ప్రతినెల 1న వేతనాలు చెల్లించాలన్నారు. అంతకు ముందు నగరంలో పొట్టి శ్రీరాములు కూడలివద్ద మానవహారం నిర్వహించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావుతో పాటు సంఘ ప్రతినిధులు నాయక్‌, కృష్ణ, కిశోర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తవిటినాయుడు, కోశాధికారి డి.శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు బగాది గిరిధర్‌, ఎం.పోతయ్య, యుగంధర్‌ పాల్గొన్నారు.

 

➡️