సాగునీటిపై ప్రభుత్వ నిర్లక్ష్యం

జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై వైసిపి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపిందని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు

అభివాదం చేస్తున్న మాజీ సిఎం చంద్రబాబు నాయుడు

2014-19 వరకు రూ.1600 కోట్లు ఖర్చు చేశాం

జగన్‌ ఐదేళ్లలో ఖర్చు చేసింది రూ.594 కోట్లే

వైసిపి ఎమ్మెల్యేలకు దోపిడీపైనే దృష్టి

‘రా కదలి రా’ బహిరంగ సభలో టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి, రూరల్‌

జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై వైసిపి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపిందని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక 80 అడుగుల రోడ్డులో సోమవారం నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఉత్తరాంధ్ర సృజల స్రవంతి ద్వారా గోదావరి నీళ్లు వంశధారకు అనుసంధానమైతే జిల్లాకు నీటి ఎద్దడి ఉండేది కాదన్నారు. టిడిపి హయంలో రూ.2 వేల కోట్లు మంజూరు చేస్తే… ఐదేళ్లలో జగన్‌ రూ.5 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు. జిల్లాలో ఉన్న శాసనసభ స్పీకర్‌కు, మంత్రికి సిగ్గు ఉందా? అని ప్రశ్నించారు. మహేంద్ర తనయా కోసం రూ.553 కోట్లు ఖర్చు చేస్తే… జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ.26 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. తోటపల్లి ప్రాజెక్టుకు రూ.237 కోట్లు తాము ఖర్చు చేయగా, ఈ ప్రభుత్వం రూ.68 కోట్లు వెచ్చించిందన్నారు. వంశధార ఫేజ్‌-2కి రూ.420 కోట్లు ఖర్చు చేస్తే… ఈ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదున్నారు. సాగునీటి ప్రాజెక్టు కోసం 2014-19 వరకు రూ.1,600 కోట్లు తాము ఖర్చు చేస్తే, వైసిపి ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం రూ.594 కోట్లు మాత్రమేనన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంశధార, బహుదా నదులను అనుసంధానం చేసి ఆరు నియోజకవర్గాలను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. జీడిపిక్క రైతులకు గిట్టు బాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. పలాసలో డిఫెన్స్‌ కోచింగ్‌ సెంటర్‌, టెక్కలిలో ఒక మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. నర్సన్నపేట పరిధిలోని బొంతు లిఫ్ట్‌ ఇరిగేషన్‌, కామేశ్వరావుపేట ఎత్తిపోతల పథకాలను పూర్తి చేస్తామన్నారు. పలాస-కాశీబుగ్గ రైల్వే ఫ్లైఓవర్‌ను పూర్తి చేస్తామని చెప్పారు. శ్రీకాకుళం నుంచి విశాఖ వరకు బీచ్‌ రోడ్డును నిర్మించి పరిశ్రమలు ఏర్పాటుతో పాటు పర్యటక రంగాన్ని అభివృద్ధి చేసి ఉద్యోగ అవకాలు కల్పిస్తామని చెప్పారు. భావనపాడు పోర్టును లాలూచీ పడి ఇష్టానుసారంగా నిర్మిస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సరిదిద్దుతామని చెప్పారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో మత్య్సకారుల కోసం జెట్టీ నిర్మిస్తామన్నారు. కళింగ వైశ్యులను ఒబిసిలుగా మార్చే బాధ్యత తనదన్నారు.వైసిపి ఎమ్మెల్యేలకు దోపిడీపైనే దృష్టిరెవెన్యూ మంత్రి ధర్మన ప్రసాదరావు శ్రీకాకుళాన్ని ప్రసాదంలా ఆరగిస్తున్నారని విమర్శించారు. ఇసుక రాంప్‌ వ్యవహారాలను కొడుకు చేతిలో పెట్టి అర్జన చేస్తున్నారని చెప్పారు. సావిత్రిపురంలో 67 ఎకరాల్లో భారీ లే అవుట్లు వేశారని, అందులో 23 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయని అన్నారు. అరాచకానికి కేరాఫ్‌ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ అని అసెంబ్లీకి రావడానికి అర్హత లేని వ్యక్తి అని విమర్శించారు. వ్యాపారుల నుంచి కమీషన్లు, పోర్టులో ఉద్యోగాల పేరుతో డబ్బులు గుంజుతున్నారని చెప్పారు ఆమదాలవలసలో శాసనసభ స్పీకర్‌ తమ్మినేని అక్రమార్జన కోసం జనంపైకి కొడుకుని, భార్యను వదిలారని చెప్పారు. నాగావళి-వంశధార నుంచి వచ్చే ఇసుక లారీకి రూ.6,000 వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఆమదాలవలసలో రూ.4 కోట్ల విలువైన 20 సెంట్ల భూమిని బెదిరించి లాక్కున్నారని చెప్పారు. పలాసలో మంత్రి అప్పలరాజు నియోజకవర్గాన్ని అడ్డంగా మింగేస్తున్నారని చెప్పారు. పలాసలో మళ్లీ గెలిస్తే కొండలే ఉండవన్నారు. పాతపట్నం నియోజకవర్గాని ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఇసుక ట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే ధర్నాన కృష్ణదాస్‌ ప్రయివేటు కాలేజీని బలవంతంగా ఖాళీ చేయించి కబ్జా చేశారని ఆరోపించారు తోటాడలో స్టోన్‌ క్రషర్‌ పేరుతో పదెకరాల భూమిని ఆక్రమించారని ఆరోపించారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షడు కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జిల్లాలోని వైసిపి ప్రజా ప్రతినిధులకు పరిపాలన చేతకాదన్నారు. జగన్‌ తన సొంత మనుషులకు ఉత్తరాంధ్రను అప్పగించారని విమర్శించారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస వరకు పది కిమీ రోడ్డు వేసుకోలేని దుస్థితిలో శాసనసబ స్పీకర్‌ తమ్మినేని, మంత్రి ధర్మాన ఉన్నారని విమర్శించారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ మాట్లాడుతూ వంశధార నిర్వాసితులకు 2013 చట్టం అమలు, తిత్లీ పరిహారం ఇవ్వకుండా జగన్మోహన్‌రెడ్డి మోసం చేశారని విమర్శించారు. శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ కోడిరామ్మూర్తి స్టేడియంపై రాజకీయాలు చేసిన మంత్రి ధర్మాన ఇప్పుడు ఎందుకు పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. టిడిపి హయంలోనే మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. చంద్రబాబు ఘన స్వాగతంజిల్లాకు వచ్చిన చంద్రబాబుకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, పలు నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, కలమట వెంకటరమణ, కొండ్రు మురళీమోహన్‌, నాయకులు పీరుకట్ల విశ్వప్రసాద్‌, జనసేన నాయకులు దానేటి శ్రీధర్‌ స్వాగతం పలికారు. సభలో పోలిట్‌బ్యూరో సభ్యులు కిమిడి కళావెంకటరావు, మాజీ మంత్రి గుండ అప్పలసూర్య నారయణ, పలు నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు గౌతు శిరీష, నాయకులు గొండు శంకర్‌, జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్‌, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు పాల్గొన్నారు.ట్రాఫిక్‌ నియంత్రణలో పోలీసుల వైఫల్యంచంద్రబాబు ముగిసిన తర్వాత జనం తీవ్ర ఇక్కట్లు పడ్డారు. సభకు వచ్చిన జనం గంటకు పైగా ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బందులు పడ్డారు. జనం రద్దీ, వాహనాలన్నీ ఒకేసారి రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ముఖ్యంగా అరసవల్లి మిల్లు కూడలి వద్ద ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. సభకు వచ్చిన ప్రజలతో పాటు నగరంలోని వివిధ పనులపై వెళ్తున్న వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుని పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. జనం భారీగా తరలివచ్చినా అందుకనుగుణంగా ట్రాఫిక్‌ నియంత్రణలో పోలీసులు విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు సభ బందోబస్తు కోసం వచ్చిన పోలీసులు జనం నియంత్రణ, ట్రాఫిక్‌ క్లియరెన్స్‌ తమ పని కాదన్నట్లుగా వ్యవహరించారు. చంద్రబాబు వేదిక నుంచి 80 అడుగుల రహదారిపై రాగానే అక్కడ ఎవరూ పోలీసులు లేకపోవడంతో ఒక్కసారిగా యువకులు కాన్వారు వెంట పరుగులు తీశారు.

 

➡️