‘స్పందన’కు 192 వినతులు

పొందూరు మండలంలో కనిమెట్టలో మూడేళ్ల క్రితం మ్యూటేషన్‌ దాఖలు చేసినా ఇప్పటికీ పరిష్కరించలేదని అన్నెపు మాధవి ఆవేదన

కలెక్టర్‌కు వివరిస్తున్న తేజేశ్వరరావు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

పొందూరు మండలంలో కనిమెట్టలో మూడేళ్ల క్రితం మ్యూటేషన్‌ దాఖలు చేసినా ఇప్పటికీ పరిష్కరించలేదని అన్నెపు మాధవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జెడ్‌పిలో సోమవారం నిర్వహించిన స్పందనలో కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తన తండ్రి వెంకటరమణ వివాహ సమయంలో పసుపు కుంకుమ కింద 0.19 సెంట్లు విస్తీర్ణం గల వ్యవసాయ భూమిని ఇచ్చారని అన్నారు. ఆ భూమిని తన పేరుతో మ్యూటేషన్‌ చేయాలని దరఖాస్తు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇటీవల జరిగిన రీ సర్వే సమయంలో అప్పటి ఇన్‌ఛార్జి తహశీల్దార్‌ను కలిసి సమయంలో మ్యూటేషన్‌ కోసం విఆర్‌ఒను కలవాలని సలహా ఇచ్చారని అన్నారు. విఆర్‌ఒను కలిస్తే ముడుపులు కావాలని ఫిర్యాదులో ఆమె వివరించారు. ఇదే మండలంలోని రాందాసుపురంలో విశ్రాంత తహశీల్దార్‌ శ్యామలరావుకు ఇలాంటి సమస్యే ఎదురైంది. తన భార్యకు అత్తవారు పసుపు కుంకుమ నిమిత్త్తం ఇచ్చిన 50 సెంట్లు వ్యవసాయ భూమిని రీ సర్వే సమయంలో తప్పుగా నమోదు చేశారని అన్నారు. 261 సర్వే నంబరులో ఉన్న ఈ భూమిని రీ సర్వే సమయంలో 260గా నమోదు చేశారని అన్నారు. సరిదిద్దాలని పొందూరు తహశీల్దార్‌ కార్యాలయంలో అనేక మార్లు తిరిగినా ఇంతవరకు సరిచేయలేదని ఫిర్యాదు చేశారు. రెవెన్యూ ఉద్యోగిగా సుదీర్ఘ కాలం సేవలు అందిన తనకే ఈ పరిస్థితి ఎదురైందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే మండలం కొంచాడకు చెందిన గోలగాన రామినాయుడు, తండ్రి గోలగాన వెంకటరమణ తన భూమి హద్దు రాళ్లు సరి చేయాలని కోరారు. ఎచ్చెర్ల మండలం ఇబ్రహీంబాద్‌లోను రీసర్వే లోపభూయిష్టంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. లోపాలను సరిదిద్దాల్సిన అధికారులు అక్రమ పద్ధతులను అనుసరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మందస మండలం హరిపురంలో పెద్దమాడి చెరువు సర్వే నంబరు 213-20 ఆక్రమణకు గురైందని, ఈ ఆక్రమణలు తొలగించాలని ఎంపిటిసి మాజీ సభ్యులు భైరిశెట్టి గున్నయ్య, పి.వాసు, పి.గణపతిరావు, కె.మహేశ్వరరావు, ఎం.జోగారావులు ఫిర్యాదు చేశారు. సంతబొమ్మాళి మండలం కాకరాపల్లికి చెందిన కింజరాపు వెంకటరమణ 15వ ఆర్థిక సంఘం నిధులతో 2022లో మంజురైన అభివృద్ధి పనులు పూర్తి చేసినా ఇంతవరకు బిల్లులు అందలేదని పేర్కొన్నారు. బకాయిలు చెల్లించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా 192 వినతులను కలెక్టర్‌ స్వీకరించారు. ఈయనతోపాటు జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, ప్రత్యేక ఉప కలెక్టర్‌ మురళి, డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్‌ వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో కెఆర్‌సి ప్రత్యేక ఉప కలెక్టర్‌ దొరబాబు, జెడ్‌పి సిఇఒ డి.వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి బి.మీనాక్షి, డ్వామా పీడీ చిట్టిరాజు, డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రాజ్యలక్ష్మి, హౌసింగ్‌ పీడీ గణపతిరావు, ఇరిగేషన్‌ ఎస్‌ఇ డోల తిరుమలరావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.గ్రానైట్‌ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి గ్రానైట్‌ క్వారీ పరిశ్రమల్లో యాజమాన్యాలు అక్రమంగా తొలగించిన 12 మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జిల్లాలో గ్రానైట్‌ క్వారీ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం, పిఎఫ్‌, ఇఎస్‌ఐ చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు చేయాలని, కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ జిల్లా పరిషత్‌లో నిర్వహించిన స్పందనలో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో టెక్కలి, కోటబొమ్మాళి, సారవకోట, పాతపట్నం, శ్రీకాకుళం రూరల్‌ మండలా ల్లోని గ్రానైట్‌ క్వారీ పరిశ్రమలు 60 వరకు ఉన్నాయని అన్నారు. వాటిల్లో పనిచేస్తున్న కార్మికులకు పిఎఫ్‌, ఇఎస్‌ఐ, గ్రాట్యూటీ, బోనస్సు, ప్రభుత్వం ప్రకటించిన సెలవులు, ఇతర కార్మిక చట్టాలు యాజమా న్యాలు అమలు చేయడం లేదని కలెక్టర్‌కు వివరించారు. రోజుకు 10 నుంచి 12 గంటల పాటు కార్మికులతో పని చేయిస్తున్నారని అన్నారు. చట్ట ప్రకారం ఓవర్‌ టైం వేతనాలు చెల్లించడం లేదన్నారు. కార్మికులంతా తమ హక్కుల కోసం చట్టబద్ధంగా దుర్గామాత ప్రొక్లెయినర్‌ ఆపరేటర్ల యూనియన్‌ రిజిస్ట్రేషన్‌ చేసి కార్మిక చట్టాల అమలు చేయాలని కోరారు. స్టాగ్‌ మినరల్స్‌, ఆదిత్య మినరల్స్‌, ఐశ్వర్య గ్రానైట్‌, క్వారీ క్రాంతి గ్రానైట్‌, తిరుపతిరానా గ్రానైట్‌, భాగ్యలక్ష్మి గ్రానైట్‌, అర్చన గ్రానైట్‌ క్వారీ యాజమాన్యాలు 12 మంది కార్మికులను అక్రమంగా తొలగించాయన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో దుర్గామాత ప్రొక్లెయినర్‌ ఆపరేటర్ల యూనియన్‌ నాయకులు కరణం మధుబాబు, దవల గోపాలరావు పాల్గొన్నారు.

 

➡️