102 కేజీల గంజాయి స్వాధీనం

ఒడిశా నుంచి కేరళకు తరలిస్తున్న

గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు

  • ఐదుగురు అరెస్టు

ప్రజాశక్తి – పలాస

ఒడిశా నుంచి కేరళకు తరలిస్తున్న 102 కేజీల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను రైల్వే జిఆర్‌పి విశాఖ సిఐ కె.వెంకటరావు జిఆర్‌పి స్టేషన్‌లో గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కేరళకు చెందిన సలీం, ఎమ్‌డి ముస్తఫా, కె.ముస్తఫా, ఫిరోజ్‌, అబ్బాస్‌ ఒడిశా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 102 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. దాన్ని రైల్లో కేరళ తరలించేందుకు పలాస రైల్వేస్టేషన్‌కు వచ్చారు. ఎవరికీ అనుమానం కలగకుండా చూడడానికి ఉన్నత వ్యక్తులుగా కనిపించేందుకు బ్రాండెడ్‌ దుస్తులు, ఖరీదైన సెల్‌ఫోన్లు వాడుతున్నారు. ఎసి బోగీలో ప్రయాణించేందుకు టిక్కెట్‌ తీసుకున్నారు. రైలు కోసం వారు ఎదురుచూస్తుండగా, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వేస్టేషన్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అప్పుడు వీరి వద్ద ఉన్న కొత్త సూట్‌కేసుల్లో రూ.50 లక్షల విలువ గల 102 కేజీల గంజాయి బయటపడింది. వీరు పలాస రైల్వేస్టేషన్‌ నుంచి ఇప్పటికే మూడుసార్లు గంజాయి రవాణా చేయగా, తొలిసారిగా పట్టుబడ్డారు. ఈ ముఠాకు సలీం నాయకుడుగా వ్యవహరించగా, మిగిలిన వారికి రవాణా కోసం సహాయం చేసినందుకు గానూ ఒక్కొక్కరికి రూ.20 వేలు చొప్పున చెల్లిస్తాడు. వీరు ఒడిశాలో కేజీ రూ.ఐదు వేలకు కొనుగోలు చేసి, కేరళలో రూ.20 వేల వరకు విక్రయిస్తుంటారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ వెంకటరావు తెలిపారు. సమావేశంలో జిఆర్‌పి ఎస్‌ఐ షరీఫ్‌, సిబ్బంది కోదండరావు, ఎం.సంతోష్‌ కుమార్‌, బి.దేవేంద్రనాథ్‌, పి.రమేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఒడిశా రాష్ట్రం నుంచి బైక్‌పై తరలిస్తున్న 24 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

➡️