16న రథసప్తమి ఉత్సవాలు

ఈనెల 16న అరసవల్లి సూర్యనారాయణ స్వామి

మాట్లాడుతున్న ఇఒ హరి సూర్యప్రకాష్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఈనెల 16న అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఇఒ) వి.హరి సూర్యప్రకాష్‌ తెలిపారు. రథసప్తమి ఏర్పాట్లపై ఆలయంలోని సమావేశ మందిరంలో పాలకమండలి సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈనెల 15న అర్ధరాత్రి నుంచి వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో క్యూలైన్లు, వచ్చే యాత్రికులకు తాగునీరు, ఆహారం, పిల్లలకు పాలు, వైద్య సేవలు, విద్యుద్దీపాలంకరణ, ఇంద్ర పుష్కరణి వద్ద స్నానఘట్టాలు, దుస్తులు మార్చుకునేందుకు అవసరమైన తాత్కాలిక షెడ్ల ఏర్పాటు, పార్కింగ్‌, వివిఐపిల తాకిడి, దాతల ప్రవేశ ఏర్పాట్లు, ప్రసాదం విక్రయ కౌంటర్ల నిర్వహణ, క్షీరాభిషేకం, పలు అలంకరణ సేవల నిర్వహణ తదితర అంశాలపై సభ్యులు చర్చించారు. ఈ సందర్భంగా ఇఒ మాట్లాడుతూ ఏటా రథసప్తమి వేడుకలకు యాత్రికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

➡️