తీర ప్రాంతంలో దాహం కేకలు

సంతబొమ్మాళి మండలం భావనపాడులో

తమవంతు నీటి కోసం వేచి ఉన్న మహిళలు

వారం రోజులుగా నిలిచిన నీటి సరఫరా

ప్రజాశక్తి- నౌపడ

సంతబొమ్మాళి మండలం భావనపాడులో దాహం కేకలు వినిపిస్తున్నాయి. గ్రామంలో తాగునీటి పథకం ద్వారా అందిస్తున్న తాగునీరు పూర్తిస్థాయిలో అందక పోవడంతో సముద్ర తీరంలోని చెలమల వద్ద మహిళలు బారులు తీరుతున్నారు. ఇసుక దిబ్బలపై చెలమలు, బావులు వద్ద నుంచి సుమారు కిలోమీటర్‌ మేర నడిచి వెళ్లి బిందెలతో ఇంటికి నీరు తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. గ్రామంలో ఉప్పునీరు అధికంగా రావడంతో పక్క గ్రామాల నుంచి పైపులైన్‌ ద్వారా నీటిని తెచ్చి ట్యాంకును నింపి గ్రామంలో సరఫరా చేస్తుంటారు. మండలంలోని భావనపాడే కాదు తీర ప్రాంతంలో పలు గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. నాయకులు ప్రతి ఎన్నికలకూ తాగునీటి సరఫరాపై వాగ్ధానాలు ఇవ్వడం తర్వాత పట్టించుకోక పోవడంతో తీర ప్రాంతంలో తాగునీటి ఎద్దడి తప్పడం లేదు. ఒక బిందె నీటి కోసం కిలో మీటర్‌ దూరం వెళ్లాల్సి రావడంతో గంటల తరబడి సమయం పడుతుంది. దీంతో పలువురు ఉపాధి హామీ పనులకు వెళ్లలేక నీటి కోసం కాపు కాయాల్సిన పరిస్థితి వస్తుంది. చెలమల్లో నీరు ఉన్నంతవరకే నీటిని తోడి తర్వాత నీరు ఊరినంతవరకు వేచి ఉండాల్సిన పరిస్థితి భావనపాడులో ప్రస్తుతం ఉంది. ప్రస్తుతం భావనపాడుకు వస్తున్న నీటిని దారి మధ్యలో ఉన్న సూర్యమణిపురం గ్రామస్తులు అడ్డుకోవడంతో తమ గ్రామానికి పూర్తి స్థాయిలో నీరు అందడం లేదని గ్రామ స్తుడు బి.ఫకీరు చెప్తున్నారు. ఇది వరకే అధికా రులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. గ్రామస్తులకు పూర్తిస్థాయిలో నీటి సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని మహిళలు కోరుతున్నారు.

 

➡️