పైసలు ఇస్తేనే హాజరు

పురపాలక సంఘంలోని శానిటరీ అసిస్టెంట్‌

పురపాలక సంఘ కార్యాలయం

శానిటరీ అసిస్టెంట్‌ వేధింపులు

భరించలేకపోతున్నామంటున్న కార్మికులు

ప్రజాశక్తి- ఆమదాలవలస

పురపాలక సంఘంలోని శానిటరీ అసిస్టెంట్‌ కల్యాణ్‌ శేఖర్‌ వేధింపులను భరించలేక పోతున్నామని పారిశుధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే పురపాలక సంఘం పరిధిలో 62 మంది పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు వేకువజామున 5 గంటలకు మోణింగి వారి వీధిలో నున్న మస్టర్‌ పాయింట్‌ వద్దకు వెళ్లి హాజరు వేసుకొని అక్కడి నుంచి వారికి కేటాయించిన ప్రాంతానికి వెళ్లి విధులు నిర్వహిస్తూ ఉంటారు. అయితే శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ హాజరు వేయాల్సి ఉన్నప్పటికీ ఆయన విధులకు సక్రమంగా హాజరు కాకపోవడంతో శానిటరీ అసిస్టెంట్‌ కళ్యాణ్‌ శేఖర్‌ కనుసన్నలలోనే అంతా జరుగుతుండడంతో గడచిన కొన్నేళ్లుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని పారిశుధ్య కార్మికులు వాపోతున్నారు. శానిటరీ అసిస్టెంట్‌ కళ్యాణ్‌ శేఖర్‌ పలాసలో విధులు నిర్వహిస్తూ డిప్యూటేషన్‌పై ఆమదాలవలస వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. పారిశుధ్య కార్మికులు విధులకు రావడానికి ఐదు నిమిషాలు ఆలస్యమైనా ఆ రోజు హాజరు పట్టికలో ఆబ్సెంట్‌ నమోదు చేస్తున్నారని అక్కడ నుంచి రెండు, మూడు రోజులు విధులకు హాజరైనప్పటికీ తీసుకోవడం లేదని కార్మికులు వాపోతున్నారు. నెలాఖరులో కార్మికులను శానిటరీ అసిస్టెంట్‌ పిలిపించి జీతం సక్రమంగా రావాలంటే ఒక్కో పని దినానికి రూ.300 తనకు ముట్ట చెప్పితే విధులకు సక్రమంగా హాజరైనట్లు హాజరును వేసి అధికారులకు అందజేస్తానని, కోతలు లేకుండా పూర్తిస్థాయిలో జీతాలు అందుతాయని చెబుతుండడంతో ఆయన అడిగిన మొత్తాన్ని ముట్ట చెబుతున్నామని పారిశుధ్య కార్మికులు చెబుతున్నారు. అలాగే కార్మికులకు సెలవు కావాలన్నా ఆయన అడిగిన పైకం ఇస్తేనే సెలవు మంజూరవుతుందని, లేకుంటే సెలవులు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, దీంతో ఆయన అడిగిన మొత్తం ఇవ్వక తప్పడం లేదని కార్మికులు వాపోతున్నారు. ఈ సంఘటనలపై పలుమార్లు గతంలో స్పీకర్‌, మున్సిపల్‌ ఉన్నతాధికారులకు తెలియజేశామని అప్పట్లో ఈయన డిప్యూటేషన్‌ రద్దుచేసి పలాస తిప్పి పంపాలని మున్సిపల్‌ అధికారులకు స్పీకర్‌ ఆదేశించినప్పటికీ కొంతమంది వైసిపి నాయకులతో శానిటరీ అసిస్టెంట్‌ మంతనాలు చేసి మళ్లీ ఇక్కడే ఉండిపోయారని కార్మికులు గుర్తు చేసుకుంటున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక మున్సిపాలిటీకి చెందిన ఓ టిడిపి ప్రధాన నేతను మచ్చిక చేసుకుని ప్రతిరోజు ఆయన దగ్గరికి వెళ్లి లేనిపోని విషయాలు చెబుతూ మళ్లీ ఇక్కడే కొనసాగేందుకు పావులు కదుపుతున్నారని పలువురు చెబుతున్నారు. శానిటరీ అసిస్టెంట్‌ స్వస్థలం శ్రీకాకుళం కావడంతో ఆమదాలవలస దగ్గర్లోనే ఉండడం, అధిక మొత్తం ఆదాయం సమకూరడంతో ఆయన ఇక్కడ నుంచి వెళ్లడానికి ఇష్టపడడం లేదని మున్సిపల్‌ ఉద్యోగులే చెబుతున్నారు. మార్కెట్లో ఉన్న అరటి పళ్లు, టిఫిన్‌, పలు రకాల దుకాణాల నుంచి నెలవారి మామూళ్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. తొందరలోనే సిఐటియు నాయకులతో కలిసి ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను తెలియజేస్తామని పారిశుధ్య కార్మికులు చెబుతున్నారు.

 

➡️