లౌకికవాదప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి

మతోన్మాద బిజెపితో జత కట్టిన

సమావేశంలో మాట్లాడుతున్న గోవిందరావు

  • సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు పిలుపు

ప్రజాశక్తి – సోంపేట

మతోన్మాద బిజెపితో జత కట్టిన టిడిపి, జనసేన కూటమిని… నిరంకుశ వైసిపిని ఈ ఎన్నికల్లో ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు ప్రజలకు పిలుపునిచ్చారు. లోక్‌సభలో సిపిఎం, వామపక్షాల బలాన్ని పెంచి కేంద్రంలో ప్రత్యామ్నాయ లౌకికవాద ప్రభుత్వం ఏర్పడేలా చూడాలని పిలుపునిచ్చారు. వామపక్ష శక్తుల ప్రత్యామ్నాయమే ఈ దేశానికి రక్షణ అని అన్నారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఆ పార్టీ మండల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మోడీ నియంతృత్వ బిజెపి ప్రభుత్వం దశాబ్దకాలంగా సాగించిన పాలనతో లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి మూల స్తంభాలుగా భావించే లౌకికవాదం, ప్రజాస్వామ్యం, ఆర్థికసార్వభౌమత్వం, సమాఖ్యవాదం, సామాజిక న్యాయ వ్యవస్థలను పద్ధతి ప్రకారం బిజెపి ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం దేశంలో కార్మిక హక్కులను కాలరాసేందుకు నిరంకుశ పద్ధతులను అవలంభిస్తోందన్నారు. తద్వారా భారతదేశాన్ని ప్రపంచంలోకెల్లా అత్యంత అసమానతలు కలిగిన సమాజాల్లో ఒకటిగా మారుస్తోందని విమర్శించారు. మరోవైపు ప్రజలను మతపరంగా విభజించేందుకు విషపూరితమైన మతోన్మాద సిద్ధాంతాలను అమలు చేస్తోందని చెప్పారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపితో టిడిపి, జనసేన పొత్తు పెట్టుకోవడం… బిజెపి తొత్తుగా వైసిపి వ్యవహరించడం ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయన్నారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహనరావు, మండల కన్వీనర్‌ ఎస్‌.లకీëనారాయణ, జుత్తు సింహాచలం, కె.సింహాచలం, రామారావు పాల్గొన్నారు.

➡️