పోలింగ్‌కు సర్వం సిద్ధం

ఈనెల 13న పోలింగ్‌కు

మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌

  • 2,358 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు
  • సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
  • జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌
  • రెండు వేల మందితో బందోబస్తు
  • ఎస్‌పి జి.ఆర్‌ రాధిక

ప్రజాశక్తి – శ్రీకాకుళం

ఈనెల 13న పోలింగ్‌కు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ తెలిపారు. పోలింగ్‌ ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో ఎస్‌పి జి.ఆర్‌ రాధిక, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనాతో కలిసి శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆరోజు ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం ఆరు గంటలు దాటినా క్యూలో వేచి ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారు. హింసకు తావులేని, రీ పోలింగ్‌కు అవకాశం ఇవ్వని ఎన్నికల కోసం జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో 2,358 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 18,92,457 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. ఇందులో పురుషులు 9,29,859 మంది కాగా, మహిళలు 9,45,945 మంది ఉన్నారని తెలిపారు. ఇప్పటికే ఓటరు కార్డు ఉన్న వారిని మినహాయించి కొత్తగా 2,80,703 ఎపిక్‌ కార్డులు ముద్రించామని, వాటిని పోస్టల్‌ శాఖ ద్వారా ఓటరు ఇంటికే పంపించినట్లు తెలిపారు. ఓటరు అవగాహన కోసం జిల్లాలో స్వీప్‌ పేరుతో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఐదు లక్షల మందిని భాగస్వాములుగా చేశామని చెప్పారు.సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు 520జిల్లాలో 2,358 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా, వాటిలో 298 ప్రాంతాల్లో 520 కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించామని తెలిపారు. పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంతరాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 268 మంది సెక్టార్‌ ఆఫీసర్లు, 707 మంది మైక్రో అబ్జర్వర్లు నిరంతరాయంగా పోలింగ్‌ పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షిస్తారని చెప్పారు. హింసకు అవకాశం ఉండే పోలింగ్‌ కేంద్రాల్లో కేంద్ర బలగాలు బందోబస్తు నిర్వహిస్తాయన్నారు. జిల్లాలో 1655 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశామని చెప్పారు. 333 మంది వీడియోగ్రాఫర్లతో పోలింగ్‌ సరళిని ఎప్పటికప్పుడు చిత్రీకరించి, జిల్లా కేంద్రంలోని కంట్రోల్‌రూమ్‌ నుంచి పర్యవేక్షిస్తామన్నారు.మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుపోలింగ్‌ శాతం పెంచేందుకు వీలుగా ఓటర్లను ఆకర్షించేలా జిల్లాలో 31 మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలను ప్రత్యేకంగా సిద్ధం చేశామని తెలిపారు. ఇవికాకుండా యువత కోసం నాలుగు, మహిళల కోసం పింక్‌ స్టేషన్లు ఎనిమిది, వికలాంగుల రెండు పోలింగ్‌ కేంద్రాలను ఎంపిక చేసిన వాటిలో ఒక్కో ప్రత్యేకత ఉండేలా తీర్చిదిద్దామన్నారు. వేసవి దృష్ట్యా అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద షామియానాలు, చల్లటి నీరు, ఫ్యాన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. వృద్ధులు, వికలాంగుల కోసం 1741 వీల్‌ చైర్లు అందుబాటులో ఉంచామన్నారు. విధుల్లో ఉన్న సిబ్బంది ఇబ్బందులు పడకుండా మరుగుదొడ్లు, నీటి సౌకర్యం, భోజన వసతి కల్పిస్తున్నామన్నారు.టోల్‌ ఫ్రీ నంబరు 18004256625ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తితే సంయమనం పాటించాలని కోరారు. ఏమైనా సమస్య తలెత్తితే 18004256625 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేసి తెలియజేయవచ్చని తెలిపారు. ఓటర్లకు సంబంధించిన సమాచారం కోసం 1950ను సంప్రదించవచ్చన్నారు. ఎవరైనా మద్యం, నగదు ఇతర బహుమతులతో ప్రలోభాలకు గురి చేస్తే సి-విజిల్‌ యాప్‌కు నేరుగా వీడియోలు, ఫొటోలు పంపించవచ్చని చెప్పారు. నిరంతరం కంట్రోల్‌రూమ్‌ పనిచేస్తుందని తెలిపారు. ఎచ్చెర్లలోని శివానీ ఇంజనీరింగ్‌ కళాశాలలో రిసెప్షన్‌ కేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వచ్చే నెల నాలుగో తేదీన కౌంటింగ్‌ కూడా అక్కడే చేపడుతున్నట్లు తెలిపారు.భారీ బందోబస్తుపోలింగ్‌కు రెండు వేల మందితో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్‌పి జి.ఆర్‌ రాధిక తెలిపారు. 11 పారామిలటరీ బృందాలు, రెండు ప్లటూన్లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఏడు అంతర్రాష్ట్ర, నాలుగు అంతర్‌ జిల్లాల చెక్‌పోస్టులు పనిచేస్తున్నాయని చెప్పారు. ఇప్పటివరకు రూ.4.39 కోట్ల విలువైన నగదు, బంగారం, వెండి, మద్యం, గంజాయి, ఉచిత పంపిణి సామగ్రి వంటివి సీజ్‌ చేసినట్లు తెలిపారు. 4,624 మందిపై ముందస్తుగా బైండోవర్‌ కేసులు నమోదు చేశామన్నారు. జిల్లాలో 273 గన్‌ లైసెన్స్‌ హోల్డర్స్‌ ఉండగా, ఇప్పటికే 199 మంది గన్స్‌ డిపాజిట్‌ చేశారని చెప్పారు. పోలింగ్‌ రోజున పోలింగ్‌ కేంద్రాల ప్రవేశ మార్గం నుంచి 200 మీటర్ల పరిధి పైన మాత్రమే రాజకీయ పార్టీలు తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆయా నియోజకవర్గాల్లో బయట నియోజకవర్గాల నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరూ ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా, శాంతియుతంగా ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

➡️