బోణీ పడింది

సార్వత్రిక ఎన్నికల సమరంలో కీలకమైన

టెక్కలి : నామినేషన్‌ దాఖలు చేస్తున్న రాజేష్‌

  • మొదలైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
  • తొలి రోజు ఆరు నామినేషన్లు
  • నామినేషన్ల వేసిన వారంతా స్వతంత్ర అభ్యర్థులే
  • ర్‌ఒ కార్యాలయాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

సార్వత్రిక ఎన్నికల సమరంలో కీలకమైన నామినేషన్ల ఘట్టానికి తెర లేచింది. జిల్లాలోని ఒక పార్లమెంట్‌, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి నామినేషన్లను స్వీకరించారు. తొలి రోజైన గురువారం మొత్తం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇచ్ఛాపురం, టెక్కలిలో ఒక్కటి చొప్పున, ఆమదాలవలస, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో రెండు చొప్పున నామినేషన్లు దాఖలు అయ్యాయి. శ్రీకాకుళం, పాతపట్నం, నరసన్నపేట, పలాస అసెంబ్లీ, శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. నామినేషన్లను స్వీకరించే రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ వెలువడడంతో అధికారులు నామినేషన్ల స్వీకరణ మొదలుపెట్టారు. ఈనెల 18 నుంచి 25 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. జిల్లాలో ఒక పార్లమెంట్‌, ఎనిమిది శాసనసభా నియోజవర్గాలకు నామినేషన్లను స్వీకరణ ప్రారంభించారు. ఎంపీ స్థానానికి గురువారం ఒక్క నామినేషనూ దాఖలు కాలేదు. ఆమదాలవలస, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో రెండేసి, టెక్కలి, ఇచ్ఛాపురంలో ఒక్కొక్కటి నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి రోజు నామినేషన్లు వేసిన వారందరూ స్వతంత్ర అభ్యర్థులే. ఇచ్ఛాపురం : ఇచ్ఛాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మండలంలోని రాజపురానికి చెందిన మాజీ సర్పంచ్‌ జన్నేల వరప్రసాదరావు నామినేషన్‌ దాఖలు చేశారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో తొలి రోజు ఆ ఒక్క నామినేషన్‌ మాత్రమే దాఖలైంది. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సుదర్శన్‌ దొరకు నామినేషన్‌ పత్రాలను అందించారు. వరప్రసాదరావు 2019 ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 1656 ఓట్లు పడ్డాయి. డిపాజిట్‌ కూడా దక్కలేదు. ఈసారి కూడా ‘రైతు కులం’ సంఘం పేరుతో పలు సమావేశాలు నిర్వహించి రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. టెక్కలి : టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అట్టాడ రాజేష్‌ తన నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నూరుల్‌ కమర్‌కు అందించారు. నందిగాం మండలం పెద్దలవునిపల్లికి చెందిన రాజేష్‌ మాత్రమే తొలి రోజు నామినేషన్‌ను దాఖలు చేశారు. దీంతో బోణీ పడినట్లయింది.ఆమదాలవలస : ఆమదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పొందూరు మండలం లోలుగుకు చెందిన లోలుగు వెంకట రాజశేఖర్‌, ఆమదాలవలస మున్సిపాల్టీలోని మెట్టక్కివలసకు చెందిన గణపతి జగదీశ్వరరావు తహశీల్దార్‌ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి ఎం.నవీన్‌కు అందించారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ కె.వేణుగోపాల్‌, ఎన్నికల డిటి మురళీధర్‌ నాయక్‌, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.ఎచ్చెర్ల : ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులుగా రణస్థలం మండలం పాతర్లపల్లికి చెందిన నేతల ఈశ్వరరావు, లావేరు మండలం తామాడకు చెందిన నడుపూరు ఈశ్వరరావు నామినేషన్లు దాఖలు చేశారు.

➡️