ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్‌ఇ సిలబస్‌

ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్‌ఇ సిలబస్‌ను ప్రభుత్వం

మాట్లాడుతున్న డిఈఒ వెంకటేశ్వరరావు

జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి – రణస్థలం

ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్‌ఇ సిలబస్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వరరావు తెలిపారు. మండలంలోని కొండములగాం మోడల్‌ స్కూల్‌లో సిబిఎస్‌ఇ సిలబస్‌ అమలు చేసే పాఠశాలల్లో పనిచేసే ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్‌, ఉపాధ్యాయులకు రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు సిబిఎస్‌ఇ సిలబస్‌ వరమన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సిబిఎస్‌ఇ సిలబస్‌ ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మరింత రాణిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్పొరేట్‌, ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. విద్యా ప్రమాణాల విషయంలోనూ మెరుగుదల ఉందని, అందుకు పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాధించిన మార్కులే నిదర్శమన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, ఇతర విద్యా సామగ్రితో పాటు పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం వరకు అన్నీ ఉచితంగా లభిస్తాయన్నారు. సిబిఎస్‌ఇ సిలబస్‌ అమలు చేసే పాఠశాలల్లో పనిచేసే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతుల్లో అనుమానాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. శిక్షణా తరగతులో డిప్యూటీ డిఇఒ ఆర్‌.విజయకుమారి, రాష్ట్ర పరిశీలకులు ఎస్‌.వి.డి రమణ, రాష్ట్ర మోనటరీ అధికారి ప్రసాద్‌, మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ పొట్నూరు శ్రీధర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

 

➡️