నేడు చంద్రబాబు రాక

ప్రజాగళం యాత్రలో భాగంగా తెలుగుదేశం పార్టీ

పలాసలో ‘ప్రజాగళం’

ప్రజాశక్తి – పలాస

ప్రజాగళం యాత్రలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం పలాస రానున్నారు. సాయంత్రం 5.15 గంటలకు చంద్రబాబు ప్రత్యేక విమానంలో పలాస జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 5.20 గంటలకు హెలీప్యాడ్‌ నుంచి ప్రత్యేక బస్సులో పర్యటించి 5.30 గంటలకు పలాస ఇందిరాగాంధీ చౌక్‌కు చేరుకుంటారు. సాయంత్రం ఆరు నుంచి రాత్రి 7.30 గంటల వరకు బహిరంగ సభలో మాట్లాడతారు. 7.40 గంటలకు ఇందిరాచౌక్‌ నుంచి టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ఇంటికి ప్రత్యేక బస్సులో చేరుకుని అక్కడ రాత్రి బస చేస్తారు.టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను ఆదివారం పర్యవేక్షించారు. పలాస జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో హెలీప్యాడ్‌, ఇందిరాచౌక్‌ వద్ద సభా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం టిడిపి కార్యాలయంలో టిడిపి, బిజెపి, జనసేన నాయకులతో, ఆ తర్వాత వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పలాస నియోజకవర్గంతో పాటు జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో టిడిపి నాయకులు యార్లగడ్డ వెంకన్న చౌదరి, రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, ఎల్‌.కామేశ్వరరావు, జి.సూర్యనారాయణ, జనసేన నాయకులు వి.దుర్గారావు, బిజెపి నాయకులు పి.వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.

➡️