డెంగీ నివారణే లక్ష్యం

డెంగీ నివారణే లక్ష్యమని జిల్లా వైద్యారోగ్యశాఖ

జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న డిఎంహెచ్‌ఒ మీనాక్షి

జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

డెంగీ నివారణే లక్ష్యమని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి అన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమని చెప్పారు. జాతీయ డెంగీ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ కీటక జనిత వ్యాధి నియంత్రణ ర్యాలీని జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయ ఆవరణలో జెండా ఊపి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వృథా నీటి నిర్మూలన ద్వారా దోమలను నివారించవచ్చన్నారు. డెంగీ సోకడానికి కారణాలు ప్రతిఒక్కరూ తెలుసుకోవాలన్నారు. వాటి నివారణకు చేపట్టాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన ఉండాలన్నారు. డెంగీ, మలేరియా వంటివి దోమల ద్వారా సంక్రమిస్తాయన్నారు. డెంగీ ఈడిస్‌ ఈజిప్టు దోమకాటు ద్వారా సంక్రమిస్తుందని తెలిపారు. ప్రతిఒక్కరూ దోమలు వ్యాప్తి చెందకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దోమలు సంతానోత్పత్తి చేసేందుకు వీల్లేకుండా కచ్చితంగా పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలన్నారు. నివారణ కోసం ప్రతిఒక్కరూ పూర్తి నిబద్దతతో విధులు నిర్వహించడం జరుతుందని ప్రతిజ్ఞ చేశారు. నిల్వ ఉన్న నీటిలో మాత్రమే డెంగీ దోమలు సంతానోత్పత్తి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రతిఒక్కరూ ఇంట్లో, ఆరుబయట నీటి నిల్వలు లేకుండా డ్రైగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల డెంగీని అరికట్టేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే తక్షణమే రక్తపరీక్ష, ఎలిసా పరీక్షలు వంటివి చేయించుకుని, వ్యాధి నిర్ధారణ అయితే తక్షణమే వైద్యుని సంప్రదించాలన్నారు. ఎటువంటి ప్రాణాపాయ పరిస్థితి ఉండబోదని తెలిపారు. డెంగీపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కోరారు. ఇటువంటి కార్యక్రమాలు ర్యాలీ వరకు మాత్రమే పరిమితం కాకుండా మున్సిపల్‌, పారిశుధ, పంచాయతీ అధికారులు, సిబ్బంది డెంగీపై ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి పి.వి సత్యనారాయణ, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ లింగరాజు, జిల్లా మాస్‌ మీడియా అధికారి పైడి వెంకటరమణ, మలేరియా కన్సల్టెంట్‌ శ్రీకాంత్‌, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ సూపర్‌వైజర్‌ లక్ష్మి, ఎఎంఒ శ్రీనివాస్‌, నరసింహం, మురళి, సాయి, ఎఎన్‌ఎంలు, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

 

➡️