ఎన్నికల విధుల్లో లోపాలకు తావీయొద్దు

జిల్లాలో జరుగనున్న

మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

* జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌, ఎచ్చెర్ల

జిల్లాలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్‌ నిర్వహణ అత్యంత కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ అన్నారు. విధి నిర్వహణలో ఎటువంటి లోపాలకు తావు లేకుండా ఎన్నికల విధులు సజావుగా నిర్వర్తించాలని ఆదేశించారు. నగరంలోని ఆర్ట్స్‌ కళాశాల, ఎచ్చెర్లలోని వెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాలలో మంగళవారం నిర్వహించిన పిఒలు, ఎపిఒల శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడారు. పోలింగ్‌ కేంద్రంలో ఎన్నికల విధులు సజావుగా నిర్వహించే బాధ్యత ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ పోలింగ్‌ అధికారులపై ఉందన్నారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలతో ఓటింగ్‌ నిర్వహించడంపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అందులో భాగంగా మోడల్‌ పోలింగ్‌ నిర్వహించి ఆ స్లిప్‌లను భద్రపరచుకోవాలని సూచించారు. అనంతరం క్లోజ్‌ రిజల్ట్‌ క్లియర్‌ (సిఆర్‌సి) చేసిన తర్వాతనే సాధారణ పోలింగ్‌ మొదలు పెట్టాలన్నారు. పోలింగ్‌ నిర్వహించే సమయంలో ఇవిఎంలు మొరాయిస్తే ఏం చేయాలన్న ఒత్తిడి అవసరం లేకుండా ముందే అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇవిఎంల్లో ఒక ఓటు పడిన తర్వాత సాంకేతిక సమస్య తలెత్తితే రెండో ఇవిఎంను వినియోగించాలని పోలింగ్‌ పూర్తయిన తర్వాత మొదటి ఇవిఎంతో పాటు రెండో ఇవిఎంను కూడా రిసెప్షన్‌ కేంద్రంలో అప్పగించాల్సిన బాధ్యత పిఒపై ఉందన్నారు. పోలింగ్‌ జరిగే సమయంలో అనుకోని సంఘటనలు ఎదురైతే తక్షణమే సంబంధిత సెక్టోరల్‌ అధికారికి, ఎఆర్‌ఒకు, రిటర్నింగ్‌ అధికారికి తప్పనిసరిగా తెలియజేయాలన్నారు. శిక్షణా తరగతుల్లో శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులు సిహెచ్‌.రంగయ్య, లక్ష్మణరావు, ఎఆర్‌ఒలు, సెక్టోరల్‌ అధికారులు, పిఒలు, ఎపిఒలు పాల్గొన్నారు.

➡️