గ్రామాలకు పయనమైన ఎన్నికల సిబ్బంది

పోలింగ్‌కు కొన్ని గంటల వ్యవధి ఉండడంతో

ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్‌

పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన

కలెక్టర్‌ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ పోలింగ్‌కు కొన్ని గంటల వ్యవధి ఉండడంతో ఆదివారం ఎన్నికల సిబ్బంది గ్రామాలకు పయన మయ్యారు. శ్రీకాకుళం నియోజక వర్గం పరిధిలోని 279 పోలింగ్‌ కేంద్రాల్లో 1953 మంది సిబ్బందిని నియమించారు. నగరంలోని ఆర్ట్స్‌ కళాశాలలో పోలింగ్‌ సిబ్బంది ఆదివారం ఉదయం చేరుకున్నారు. ఓటింగ్‌కు అవసరమైన ఇవిఎంలు, వివిప్యాడ్స్‌, ఇతర ఎన్నికల సామాగ్రిని వారికి అందజేశారు. ఆర్ట్స్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రంలో ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. కౌంటర్ల వద్ద బూత్‌ లెవెల్‌ నంబర్లు, సామాగ్రిని అందజేసేందుకు నియమితులైన సిబ్బంది ఎక్కడ ఎటువంటి లోపాలకు తావు లేకుండా పూర్తి స్థాయి సామాగ్రిని అందజేశారు. ముందుగా రిజిష్ట్రేషన్‌ కౌంటర్లలో సిబ్బంది హాజరును తీసుకుని ఎన్నికల సిబ్బందికి డ్యూటీ ఆర్డర్లను అందజేశారు. ఇవిఎంలు, ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయడానికి ఒక్కో చోట పదికి పైగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. వరుస క్రమంలో ఎన్నికల సిబ్బందికి వారికి కేటాయించిన కౌంటరు వద్ద ఎన్నికల సామాగ్రిని అందజేశారు. ఎన్నికల సిబ్బందికి ఏదైనా సమస్య ఉంటే అనుమానాలను నివృత్తి చేయడానికి సహాయం కోసం హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. మైక్‌ల ద్వారా నిరంతరం సిబ్బందికి సూచనలు చేశారు. అలాగే మైక్రో అబ్జర్వర్లు, వెబ్‌ కాస్టింగ్‌, వీడియో గ్రాఫర్స్‌, ట్రైనింగ్‌ సెంటర్‌, రిజర్వ్‌ స్టాప్‌ కౌంటర్‌, వాహనాల కేటాయింపు కోసం కూడా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ప్రతీ పంపిణీ కేంద్రం వద్ద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి, అవసరమైన వారికి వైద్య సేవలను అందించారు. తాగునీరు, అల్పాహారం, టీ సరఫరా చేశారు. మద్యాహ్నం సమయంలో భోజన సదుపాయం కల్పించారు. సిబ్బందికి ఎక్కడా ఎటువంటి సమస్య తలెత్తకుండా అథికార యంత్రాంగం డిస్ట్రిబ్యూషన్‌ చేపట్టారు. కలెక్టర్‌ పరిశీలననగరంలోని ఆర్ట్స్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇవిఎంలు, ఇతర ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి డా.మనజీర్‌ జిలానీ సమూన్‌ సందర్శించారు. కౌంటర్ల వారీగా ఆయన సిబ్బందితో మాట్లాడారు. ఎప్పటికప్పుడు అనుమానాలను నివృత్తి చేసేందుకు వీలుగా రిటర్నింగ్‌ అధికారి సిహెచ్‌ రంగయ్యకు పలు సూచనలు చేశారు. ప్రధానంగా ఇవిఎంలు కేటాయించిన ప్రొసీడింగ్‌ అధికారులకు సోమవారం ఉదయం 5 గంటల నుంచి విధులకు సిద్దమయ్యేలా సూచనలు చేశారు. మాక్‌ పోలింగ్‌పై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరడంతో వారికి మైక్‌లో అందరికి వినిపించేలా పలు సూచనలు, అనుమానాలు నివృత్తి చేశారు. ఆయనతో పాటు సహాయక కలెక్టర్‌ రాఘవేంధ్ర మీనా, ఆర్‌డిఒ రంగయ్య , మోహనరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

➡️