ఎన్నికల వేళ విస్తృత తనిఖీలు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో

వాహనాలను తనిఖీ చేస్తున్న అధికారులు

* రూ.1.30 కోట్లు నగదు, రూ.1.36 కోట్ల విలువైన 3 కేజీల బంగారం సీజ్‌

* రూ.74 లక్షల విలువైన మద్యం స్వాధీనం

* 459 మంది అరెస్టు

ప్రజాశక్తి – శ్రీకాకుళం

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఇటీవల నగదు, మద్యం, బంగారం, వెండి వంటివి సీజ్‌ చేస్తున్న ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల వేళ తనిఖీలు కూడా ముమ్మరం చేశారు. సోమవారం విశాఖ నుంచి వస్తున్న ఒక బస్సులో రూ.28.50 లక్షలు నగదు దొరకడంతో, జిల్లాలో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచి ఇప్పటివరకు అక్రమంగా తరలిస్తున్న వాటిని ఏవేవి ఎంత మొత్తంలో స్వాధీనం చేసుకున్నారనే విషయాలు ఒక్కసారి పరిశీలిద్దాం.ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్‌ 28వ తేదీ వరకు ఎటువంటి పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న వారి నుంచి రూ.1,30,18,920 నగదును సీజ్‌ చేశారు. రూ.50 వేలు కంటే ఎక్కువ మొత్తంలో నగదును తమతో పాటు ఎవరైనా తీసుకెళ్లాలంటే వాటికి సంబంధించి బ్యాంకుల నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆ నగదును సీజ్‌ చేసే అధికారం ఫ్లయింగ్‌ స్క్వాడ్‌కు ఉంటుంది. ఈ నగదును ఆదాయపు పన్ను శాఖకు అప్పగిస్తారు. అన్ని ఆధారాలు సమర్పిస్తే జిల్లాలోని గ్రీవెన్స్‌ కమిటీ దీన్ని రిలీజ్‌ చేసే అవకాశం ఉంది. ఇక బంగారం విషయానికొస్తే 2,901 గ్రాముల బంగారాన్ని ఇప్పటివరకూ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1,36,80,284గా ఉంది. రూ.14,41,669 విలువైన 26,581 గ్రాముల వెండిని కూడా స్వాధీనం చేసుకున్నారు.రూ.74 లక్షల విలువైన మద్యం స్వాధీనం ఎన్నికల వేళ నిత్యం చర్చకు వచ్చే మద్యం విషయంలో కూడా భారీ ఎత్తున సీజర్లు నమోదయ్యాయి. 5509 లీటర్ల సారా, నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ 285 లీటర్లు, ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంచి తరలిస్తున్న 1154 లీటర్ల లిక్కర్‌ ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్నారు. సారా తయారీకి వినియోగించే 77 వేల లీటర్ల భారీ బెల్లపు ఊట నిల్వలను ధ్వంసం చేశారు. వీటన్నింటి విలువ రూ.74 లక్షలుగా ఉంది. 124.05 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా, దాని విలువ రూ.5.36 లక్షలుగా నిర్ధారించారు.459 మంది అరెస్టునగదు, మద్యం, గంజాయి వంటి అక్రమ రవాణా కేసుల్లో ఇప్పటివరకు 459 మందిని అరెస్టు చేశారు. 716 కేసులకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇందులో భాగంగా 36 మోటార్‌ సైకిళ్లు, 13 కార్లు, ఒక వ్యాను, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.87 లక్షలుగా ఉంది. సరైన పత్రాలు లేని కారణంగా 13 మొబైల్‌ ఫోన్లు, 10 చేతి గడియారాలు, 14 చీరలు, పదివేల టీ షర్టులు, 2500 కరపత్రాలు సీజ్‌ చేశారు. వీటి విలువ రూ.7.5 లక్షలుగా ఉంది.93 ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఘటనలుఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎం.సి.సి-మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌) ఉల్లంఘించిన ఘటనలు 93 చోటుచేసుకోగా వాటిలో 34 కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. 67 మంది ప్రభుత్వ ఉద్యోగులకు నోటీసులు జారీ చేయగా, 39 మందిని సర్వీస్‌ నుంచి తొలగించారు. 17 మందిపై ఇంకా చర్యలు తీసుకోవాల్సి ఉంది. 7,812 మంది గ్రామ, వార్డు వాలంటీర్లు తమ విధులకు రాజీనామా చేశారు. ఇంకా ఎంసిసి నిబంధనలు ఉల్లంఘించిన 26 మంది రాజకీయ నాయకులపై 17 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. వీటిలో వైసిపిపై 10, టిడిపిపై ఏడు నమోదయ్యాయి.నిరంతర పర్యవేక్షణజిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లో 24 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు పనిచేస్తున్నాయి. నియోజకవర్గానికి మూడు చొప్పున ఒక్కో బృందంలో ఆరుగురు వరకు సిబ్బంది 24 గంటలూ పనిచేస్తున్నారు. వీరితో పాటు ఎఫ్‌ఎస్‌టి, ఎస్‌ఎస్‌టి, సరిహద్దుల్లో నిఘా బృందాలు పనిచేస్తున్నాయి. సరైన పత్రాలు లేకుండా ప్రజలు రూ.50 వేలు కంటే నగదును తమతో తీసుకెళ్లవద్దు. ఎన్నికల ప్రక్రియ ముగిసే జూన్‌ ఆరో తేదీ వరకు నిరంతర నిఘా కొనసాగుతుంది.

– రాఘవేంద్ర మీనా, అసిస్టెంట్‌ కలెక్టర్‌

➡️