ఐక్యపోరాటాలు నిర్వహించాలి

Feb 16,2024 13:30 #srikakulam
farmers rural bandh against modi govt sklm

 సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు
ప్రజాశక్తి – రణస్థలం : కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక,కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యపోరాటాలు నిర్వహించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక, రైతాంగ వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో పైడిభీమవరం నుండి రణస్థలం వరకు శుక్రవారం బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం రణస్థలంలో రామతీర్థం జంక్షన్ వద్ద నిరసన ధర్నా చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిందని, కనీస వేతనాలు నిర్ణయించే విధానానికి స్వస్తి పలికిందిని అన్నారు. సమ్మె హక్కును కాలరాస్తున్నదని, పిఎఫ్, ఇఎస్ఐ, వెల్ఫేర్ బోర్డులను నిర్వీర్యం చేస్తున్నదని తిరిగి 12 గంటల పని విధానం అమల్లోకి తేవాలని ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. కనీస వేతనం నెలకు రూ.26 వేలు ఇవ్వాలని, ఇపిఎస్ పెన్షన్ నెలకు రూ.10 వేలకు పెంచాలని డిమాండ్ చేసారు. స్కీమ్ వర్కర్స్ కు గ్రాట్యూటీ అమలు చేయాలని, కనీస వేతనాలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థను రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేసారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ లకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ప్రజలపై భారాలు వేస్తుందని విమర్శించారు. మరోవైపు మతతత్వ విధానాలను అవలంబిస్తూ మత వైషమ్యాలు రెచ్చగొడుతుందని ప్రజల మధ్య చీలికలు తెస్తుందని అన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారానికొచ్చి 10 సంవత్సరాలు అయినా రైతాంగ, కార్మికవర్గ, ప్రజల సమస్యలను పరిష్కరించలేదని విమర్శించారు. బిజెపి అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీనిచ్చారని నేడు ఉద్యోగ కల్పన పడిపోయిందని, నిరుద్యోగం గత 50 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరిందని విమర్శించారు. కార్మికుల నిజవేతనాలు 20 శాతం తగ్గిపోయాయని ,ప్రపంచంలోని 125 దేశాల్లో ఆకలిలో భారత్ 111వ స్థానంలో ఉందని మానవాభివృద్ధిలో 191 దేశాల్లో ఇండియా 132వ స్థానంలో ఉందని, హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రకారం సంతోష జీవన సూచీ 2023 ప్రకారం 180 దేశాల్లో భారత్ 160 స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి నరేంద్రమోడీ విధానాల వల్ల కార్పొరేట్ సంస్థల లాభాలు గరిష్టస్థాయికి చేరాయని కార్పొరేట్లకు 15 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేశారని, లక్షల కోట్ల రూపాయలు పన్ను రాయితీలు ఇచ్చారని విమర్శించారు. బిజెపి ప్రభుత్వ హయాంలోనే ధరలు కనీవినీ ఎరుగని రీతిలో పెరిగాయని అన్నారు. పెట్రోలు ఉత్పత్తులపై కేంద్రప్రభుత్వం పన్నుల వాటాను 243 శాతానికి పెంచిందని, స్విస్ బ్యాంకు నుండి నల్లధనాన్ని వెనక్కి తెచ్చి పేదవారి బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తామన్న మాటను మర్చిపోయారని అన్నారు. ప్రభుత్వరంగ సంస్థలు, సహజ వనరులను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల పరం చేస్తున్నదని, తెగనమ్ముతున్నదని అన్నారు. పిఎఫ్, పెన్షన్ నిధులను ప్రైవేట్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు కట్టబెడుతున్నదని, కార్మికులు, మధ్యతరగతి ప్రజల్లో అత్యధికులు పాలసీదార్లుగా వున్న ఎల్ఐసి వాటాలను అమ్మేందుకు తెగబడిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వివిధ యూనియన్ ల నాయుకులు ఎమ్.అప్పలనర్సయ్య, ఎమ్.ఈశ్వరరావు, డి.ఎల్.నాయుడు, పి.రామకృష్ణ, వి.లక్ష్మి, కాంతమ్మ, కూర్మారావు, భీమేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️