అగ్నిమాపక నిబంధనలు తప్పనిసరి

పరిశ్రమల్లో అగ్నిమాపక

కార్మికులకు అవగాహన కల్పిస్తున్న ఫైర్‌ అధికారులు, సిబ్బంది

  • రీజనల్‌ ఫైర్‌ ఆఫీసర్‌ డి.నిరంజన్‌ రెడ్డి

ప్రజాశక్తి – రణస్థలం

పరిశ్రమల్లో అగ్నిమాపక భద్రతా నిబంధనలు పక్కాగా పాటించాలని విశాఖపట్నం రీజనల్‌ అగ్నిమాపక అధికారి డి.నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఐదో రోజు గురువారం పైడిభీమవరం పారిశ్రామికవాడలో అపిటోరియా ఫార్మా లిమిటెడ్‌ (అరబిందో) పరిశ్రమలో అవగాహనా సదస్సు నిర్వహించారు. పరిశ్రమల్లో సంభవించే అగ్ని ప్రమాదాల గురించి ఉద్యోగులు, కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కర్మాగారంలో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు అంతర్గతంగా, బాహ్యంగా వ్యాప్తిని నిరోధించడానికి, సురక్షితంగా తప్పించుకోవడానికి అన్ని ఆచరణీయ చర్యలు తీసుకోవాలన్నారు. మంటలు చెలరేగడం వల్ల వాయు కాలుష్యం, ప్రాణ నష్టం, వనరుల కొరతకు దారితీస్తుందని తెలిపారు. మంటలను ఆర్పడానికి అవసరమైన పరికరాలు, సౌకర్యాలు సిద్ధంగా ఉండాలన్నారు. అగ్నిమాపక యంత్రాల గడువు ముగిస్తే, వాటిని క్రమం తప్పకుండా మార్చాలని స్పష్టం చేశారు. అగ్నిమాపక పరికరాలను అమర్చడం మాత్రమే సరిపోదన్నారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తప్పించుకునే మార్గాలు, ప్రమాద నివారణకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలన్నారు. అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించకుండా చూసేందుకు పరిశ్రమల్లో ఫైర్‌ మాక్‌ డ్రిల్స్‌ క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. తీవ్రమైన నష్టం వాటిల్లితే, బాధితుల నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రతి పరిశ్రమ యజమాని బాధ్యత వహించాలన్నారు. ఫ్యాక్టరీల చట్టం 1948 కింద నియమితులైన చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ తన పరిధిలోకి వచ్చే ఫ్యాక్టరీలను క్రమం తప్పకుండా సందర్శించాలన్నారు. ఏదైనా నిర్వహణ లోపం ఉన్నట్లు గుర్తిస్తే తగిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి జె.మోహనరావు, రణస్థలం ఫైర్‌ ఆఫీసర్‌ పైల అశోక్‌, రణస్థలం ఫైర్‌ స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️