బలవంతపు రిటైర్మెంట్ ఆపాలి

Mar 18,2024 15:42 #srikakulam

ప్రజాశక్తి – రణస్థలం : శ్యాంక్రగ్ పిస్టన్స్ అండ్ రింగ్స్ పరిశ్రమలో బలవంతపు రిటైర్మెంట్ ఆపాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు డిమాండ్ చేసారు. 30 సంవత్సరముల సర్వీసు పూర్తయినదని బలవంతపు రిటైర్మెంట్ ఆపాలని జె.సి.ఎల్ ఆదేశాలు అమలు చేయాలని, అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో శ్యాంపిస్టన్స్ పరిశ్రమ వద్ద కార్మికులు సోమవారం ధర్నా చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రణస్థలం మండలం వరిశాం గ్రామం వద్ద గల శ్యాంక్రగ్ పిస్టన్స్ అండ్ రింగ్స్ ప్లాంట్-2 పరిశ్రమలో పదవీ విరమణ వయసు కాకుండానే ఎక్కడా లేనివిధంగా 30 సంవత్సరాలు సర్వీసు పూర్తయినదని కార్మికులను యాజమాన్యం వారు బలవంతపు రిటైర్మెంట్ చేస్తూ కార్మికులను రొడ్డున పెడుతున్నారని అన్నారు. ఆ విధంగా ఇప్పటివరకు 50 మంది కార్మికులను రొడ్డున పడేశారని అన్నారు. పది నుండి 12 సంవత్సరాలు సర్వీసు ఉన్నప్పటికీ కార్మికులను తొలగించడంతో కార్మిక కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. కార్మికులను 30 సంవత్సరాలు సర్వీసు పూర్తయిందని బలవంతపు రిటైర్మెంట్ చేయకూడదని, మోడల్ స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం 58 సంవత్సరాలు వయసు పూర్తయితేనే రిటైర్మెంట్ చేయాలని జాయిన్ కమీషనర్ ఆఫ్ లేబర్ ఆదేశాలను ఉల్లంఘిస్తూ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని అన్నారు. శ్యాంపిస్టన్స్ యాజమాన్యం కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తుందని తెలిపారు. 30 సంవత్సరాలు సర్వీసు పూర్తయినదనే పేరుతో అక్రమంగా తొలగించిన కార్మికులందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేసారు. బలవంతపు రిటైర్మెంట్ ఆపకుంటే పోరాటం చేస్తామని హెచ్చరించారు. జెసిఎల్ ఆదేశాలు యాజమాన్యం అమలు చేసేలా అధికార యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈ ధర్నాలో శ్యాంక్రగ్ పిస్టన్స్ (రింగ్స్) వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఎం.అప్పలనర్సయ్య, నాయుకులు ఎమ్.కూర్మారావు, జె.రాము, గొర్లె.కృష్ణ, రామారావు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️