యథేచ్ఛగా పశువుల అక్రమ రవాణా

పురపాలక సంఘ పరిధిలోని ఏడవ వార్డు చింతాడ వారపు

వాహనాల్లో తరలించడానికి సిద్ధం చేస్తున్న పశువులు

చోద్యం చూస్తున్న అధికారులు

ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు

ప్రజాశక్తి- ఆమదాలవలస

పురపాలక సంఘ పరిధిలోని ఏడవ వార్డు చింతాడ వారపు సంత నుంచి ప్రతి శనివారం లారీలు వ్యాన్లలో పశువుల అక్రమ రవాణాను యథేచ్ఛగా కొందరు వ్యక్తులు సాగిస్తున్నారు. ఆమదాలవలస, సరుబుజ్జిలి, బూర్జ తదితర మండలాల్లో ఉన్న రైతుల దగ్గర నుంచి పశువులను కొనుగోలు చేసి చింతాడ సంతకు తరలించి అక్కడ నుంచి విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌ వంటి ప్రాంతాల్లో ఉన్న కబేళాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో పశు వైద్యాధికారులు, పోలీసులు ఇటువంటి వారిపై నిఘా పెట్టి అక్రమ రవాణాను అడ్డుకొని పశువులను గోశాలకు తరలించేవారు. ఇటీవల కాలంలో అధికారులు పశువుల అక్రమ రవాణాపై దృష్టి సారించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో పశువుల అక్రమ రవాణా ముఠా విచ్చలవిడిగా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వంశధార నది అవతల వైపున ఉన్న జలుమూరు, నరసన్నపేట మండలాల నుంచి పశువులను కొనుగోలు చేసి వంశధార నది దాటించి పురుషోత్తపురం యరగాం వంటి గ్రామాల నుంచి వాహనాల్లో పశువులను తరలించి సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆమదాలవలస, చింతాడ సంత, కనుగులవలస, వంజంగి, పురుషోత్తపురం వంటి గ్రామాల్లో కొంతమంది గుత్తేదారులను ఏర్పాటు చేసుకుని పాడి అయిపోయిన ఆవులను తక్కువ రేట్లకు కొనుగోలు చేసి అక్కడి నుంచి విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌ వంటి ప్రాంతాలకు పశువులను తరలిస్తున్నారు. ఈ అక్రమ రవాణాను అరికట్టాల్సిన అధికారులు పశు వ్యాపారులతో కుమ్మక్కై చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పశు అక్రమ రవాణా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

 

➡️