ఉద్యమ నాయకులు గెలవకపోవడం ఆందోళనకరం

చట్టసభల్లో ప్రజా ఉద్యమాలు నడిపే వామపక్ష

మాట్లాడుతున్న అప్పలనాయుడు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

చట్టసభల్లో ప్రజా ఉద్యమాలు నడిపే వామపక్ష భావజాలం ఉన్న వారికి ప్రాతినిధ్యం లేకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆందోళనకరమని, డబ్బు, కులం నేటి చట్టసభల్లో కునారిల్లు తుండడం వల్ల ప్రజా సమస్యలను పట్టించుకునేవారు కరువవుతున్నారని ప్రముఖ రచయిత అట్టాడ అప్పల నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో అభ్యుదయ రచయితల సంఘం, రాష్ట్ర శాఖ ప్రచురించిన ఎన్నికల భారతం అనే కవితా సంకలనాన్ని ఆయన ఆవిష్కరించారు. ఎన్నికల పట్ల సమాజ స్పందనలను తెలియజేయడం కవులు, రచయితల బాధ్యతని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎన్నో సాహితీ, సాంస్కృతిక సంస్థలున్నా, అరసం ఈ కర్తవ్యాన్ని నెరవేర్చడం గొప్ప విషయమన్నారు. ఎన్నికల పేరు తెన్నులలో, రాను రానూ అనేక ప్రజాస్వామిక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లు వేసిన చేతులే, ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయన్నారు. పార్టీ సిద్ధాంతం, మేనిఫెస్టో మాత్రమే చూడకుండా, సామాజిక అభివృద్ధి బాధ్యతగల అభ్యర్థిని ఎన్నుకోవాలన్నారు. ప్రజా ఉద్యమ నాయకులు, ఎన్నికల్లో ప్రజా ప్రతినిధులుగా గెలవకపోవడం సమాజానికి తీరని నష్టమన్నారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికైన వారు, చట్టసభల్లోకి వెళ్లి, వాటి విలువలను, ప్రమాణాలను తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నారన్నారు. ప్రజాసమస్యలను పట్టించుకునేవారు కరవయ్యారన్నారు. అరసం రాష్ట్ర అధ్యక్ష వర్గ సభ్యుడు నల్లి ధర్మారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల, సాహితీ సంఘాల నాయకులు మాట్లాడారు. ప్రజా న్యాయవాది, బొడ్డేపల్లి మోహనరావు మాట్లాడుతూ, ఎన్నికల్లో ప్రజలను ప్రలోభాలు పెట్టే చర్యలు మితిమీరిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు, అది పౌరుడికి గల గొప్ప బాధ్యత, దాన్ని అమ్మకానికి పెడితే, అది కేవలం సరుకు అవుతుందనే చెప్పారు. తెలుగు రచయితల వేదిక జిల్లా అధ్యక్షులు ఉత్తరావల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలను జాగృతం చేయాల్సిన బాధ్యత సాహితీ వేత్తలపై, కవులు, రచయితలపై ఉందన్నారు.. హిందీ ప్రచార పరిషత్‌ ఉత్తరాంధ్ర నాయకులు కోనే శ్రీథర్‌, కంచరాన భుజంగరావు, దాసుబాబు పాల్గొన్నారు.

 

➡️