కౌంటింగ్‌పై అవగాహన అవసరం

కౌంటింగ్‌ ప్రక్రియపై

మాట్లాడుతున్న జిల్లా ఎన్నిక అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌

  • జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

కౌంటింగ్‌ ప్రక్రియపై సంపూర్ణ అవగాహన, పట్టు కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలాని సమూన్‌ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు-2024లో భాగంగా వచ్చే నెల 4న జరగనున్న ఓట్ల లెక్కింపునకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు, విధి విధానాలపై నగరంలోని అంబేద్కర్‌ ఆడిటోరియంలో కౌంటింగ్‌ సూపర్‌ వైజర్లు, మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్‌ అసిస్టెంట్లు తదితర సిబ్బందికి శుక్రవారం శిక్షణ ఇచ్చారు. ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన అధికారులను అభినందించారు. అదే స్ఫూర్తితో కౌంటింగ్‌ విజయవంతం చేయాలన్నారు. కచ్చితమైన, సమర్ధవంతమైన ఓట్ల లెక్కింపునకు అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలతో సిబ్బందిని సన్నద్ధం చేయడం ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవిఎంలు) లెక్కింపు కంటే ముందుగా ‘పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్ల’ లెక్కింపు జరుగుతుందని, కౌంటింగ్‌ రోజు జరిగే సంఘటనల క్రమాన్ని వివరించారు. అందుకు తగ్గట్టుగా ఈ ప్రక్రియ కోసం సమగ్రంగా సన్నద్ధం కావాలన్నారు. రాజకీయ పార్టీల ఏజెంట్లకు నమ్మకం కలిగించే వరకూ ఓపికగా ఉండాలన్నారు. కౌంటింగ్‌ పూర్తి అయ్యేంతవరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. మాస్టర్‌ ట్రైనర్లు కౌంటింగ్‌ ప్రక్రియ అవగాహన కల్పించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు, మాస్టర్‌ ట్రైనర్లు కిరణ్‌, ఎన్‌.బాలాజీ, మెప్మా పీడీ కిరణ్‌కుమార్‌, శేష గిరి, జిల్లా వ్యాప్తంగా 350 మంది వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️