ఎన్నికల విధులకు ఎన్‌సిసి కేడెట్స్‌

ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లను

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

  • కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లను ఎన్నికల విధులకు వినియోగించుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనజీర్‌ జిలాని సమూన్‌ ఆదేశించారు. వచ్చే నెల 13వ తేదీన పోలింగ్‌ జరిగే ఒక్కరోజు సామాజిక సేవ, స్వచ్ఛంద ప్రాతిపదికన వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎస్‌పి జి.ఆర్‌ రాధికతో కలిసి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 2,358 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని, ఒక్కో కేంద్రానికి ఒక్కొక్కరు చొప్పున 18 ఏళ్లు నిండిన ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్‌ కేడెట్లను వినియోగిస్తామని తెలిపారు. ఇందుకు గానూ వారి తల్లిదండ్రుల నుంచి సమ్మతి పత్రాలు తీసుకోవాలని చెప్పారు. వీరికి శాంతిభద్రతలకు సంబంధించి ఎలాంటి పనులు అప్పగించబోమని, ఓటరు సహాయం కోసం మాత్రమే వీరి సేవలను వినియోగిస్తామని స్పష్టం చేస్తారు.ఎస్‌పి రాధిక మాట్లాడుతూ ఎన్‌సిసి కేడెట్లు 852 మంది అందుబాటులో ఉన్నారని, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు 1774 ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. పోలింగ్‌ విధుల్లో పాల్గొనే వీరికి భోజన, వసతి, రవాణా సదుపాయం కల్పిస్తామన్నారు. సమావేశంలో స్పెషల్‌ బ్రాంచ్‌ డిఎస్‌పి ఎ.త్రినాథరావు, ఎన్‌సిసి ఎఎన్‌ఒ వై.పోలినాయుడు, 14వ ఎన్‌సిసి బెటాలియన్‌ తరుపున షేక్‌ కమాల్‌, జితేంద్ర కుమార్‌, పోలీసుల తరుపున జి.నిర్మల, సిహెచ్‌.సూరినాయుడు, సెట్‌శ్రీ సిఇఒ ప్రసాదరావు తదితరులు ఉన్నారు.

➡️