గోడ దెబ్బ… చెంప దెబ్బ

అధికారులు, ఉద్యోగులకు ప్రస్తుతం గోడ దెబ్బ, చెంప దెబ్బ

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి

అధికారులు, ఉద్యోగులకు ప్రస్తుతం గోడ దెబ్బ, చెంప దెబ్బ రెండూ తగులుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ వారిని దోషులుగా చూపే ప్రయత్నం చేస్తున్నాయి. ఇటీవల వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో మనం చూశాం. అధికారుల సంగతి చూస్తామన్నట్లుగా బెదిరింపులకు దిగారు. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న భయం వారిని వెంటాడుతోంది. ఇప్పటికే కొంత మంది అధికారులు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదిఇలా ఉండగా మాజీ ఉపముఖ్య మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ జిల్లా పార్టీ కార్యాలయం నిర్మాణం విషయంలోనూ అధికారులదే తప్పిదమన్నట్లు నిందించడం చూశాం. పెద్దపాడులో నిర్మిస్తున్న వైసిపి కార్యాలయా నికి అనుమతులు లేవంటూ నోటీసులు ఇవ్వడంపై మీడియా సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు. కార్యాలయం నిర్మాణం 80 శాతం పూర్తయినంతవరకు అధికారులు ఏం చేస్తున్నారని, ఇప్పుడు నోటీసులు అతికించడమేమిటని కృష్ణదాస్‌ ప్రశ్నించడం అందరినీ విస్తుగొల్పుతోంది. అధికార పార్టీని ఎదిరించే సాహసమే ఉంటే అప్పుడే వారు నోటీసులు ఇచ్చేవారు. అప్పుడు వారి పనివారు చేయకుండా ఒత్తిళ్లకు గురి చేసి ఆ దరిదాపుల్లోకి రానీయకుండా చేసి ఇప్పుడు అధికారులను నిందించడం ఎంత వరకు సమంజసమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పార్టీ కార్యా లయాలపై రచ్చ చేస్తున్న టిడిపి నాడు శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులో నిర్మించిన స్థలం కూడా ఎవరూ దాతలు ఇచ్చిందేమీ కాదు. బిసి సంక్షేమశాఖకు చెందిన ఆ స్థలాన్ని లీజు పేరుతో నాడు తీసుకుని అందులో పార్టీ భవనాన్ని నిర్మించిన విషయంపై గతంలోనే అనేక విమర్శలు వచ్చాయి. అయినా వెనక్కి తగ్గకుండా టిడిపి నాడు పార్టీ కార్యాలయాన్ని నిర్మించింది. ప్రస్తుత వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భవన నిర్మాణ సమయంలోనూ మంత్రిగానే ఉన్నారు. ఆయన ఆదేశాలతోనే తతంగమంతా నడిచిందన్న విమర్శలూ లేకపోలేదు. అంతెందుకు ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంగా ఉన్న ఇందిరా విజ్ఞాన్‌ భవన్‌ను చెరువుగర్భాన్ని ఆక్రమించి కట్టారని నాడు మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అనేకసార్లు ప్రస్తావించినా అధికారులు కనీసం స్పందించలేదు. మాజీ రెవెన్యూ మంత్రి ఆదేశాలతోనే అధికారులు డిసిసి భవన నిర్మాణానికి పూనుకున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అధికారంలో ఏ రాజకీయ పార్టీ ఉంటే ఆ పార్టీ ప్రభుత్వ స్థలాల్లో పార్టీ భవంతులను నిర్మించడమనేది ఒక సంప్రదాయంగా మార్చేశారు. రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగా నేడు టిడిపి దానిపై దృష్టి సారించడంతో అన్ని పార్టీల గుట్టూ తేలుతోంది. పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ స్థలాలను కేటాయింపు జరిపే విషయంలో టిడిపియే తొలుత నాంది పలికిందని వైసిపి ఆరోపిస్తోంది. 2014లో అసెంబ్లీలో పార్టీలకు ఉన్న బలాల ఆధారంగా అమరావతితో పాటు జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలకు స్థలాలను కేటాయిస్తూ ఒక జిఒను సైతం తీసుకొచ్చింది. అందులో భాగంగానే ప్రస్తుతం 80 ఫీట్‌ రోడ్డులోని టిడిపి కార్యాలయాన్ని నిర్మించారు. ఇప్పుడే ఏమీ ఎరగనట్లు వైసిపి అక్రమంగా పార్టీ కార్యాలయాలను నిర్మించేస్తోందంటూ గగ్గోలు పెట్టడం ఆశ్చర్యంగా ఉంది.తనకు గన్‌మెన్లు వద్దంటూ ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తిరస్కరించడం కొంత చర్చనీయాంశంగా మారింది. తన భద్రతకోసం ప్రభుత్వం కేటాయించిన అంగరక్షకులను తిరిగి పంపేశారు. తనకు శత్రువులు ఎవరూ లేరని, తాను అధికారంలో ఉన్నప్పటి కంటే ప్రతిపక్షంలోనే బలంగా పని చేశానని, ప్రజల్లో నిత్యం ఉన్నానని చెప్పుకొచ్చారు.. తనకు, ప్రజలకు మధ్య అడ్డుగోడలు ఉండరాదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కరాఖంగా తేల్చి చెప్పారు. ఆయనకు మంత్రి పదవి రాలేదన్న ఆవేదనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారంటూ మరోవైపు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. కారణాలేవైనా తనకు ప్రజలతో కలిసి ఉండటమే ఇష్టమని, సాధారణ ఎమ్మెల్యేగానే ప్రజలకు సేవలందిస్తానంటూ గన్‌మెన్లను తిరస్కరించడం ద్వారా జిల్లాలో ఒక కొత్త సంప్రదాయానికి నాంది పలికారు. వైసిపి మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనకు భద్రత పెంచాలని హైకోర్టులో పిటీషన్‌ వేసిన నేపథ్యంలో ఇలా ఉన్న గన్‌మెన్లను వెనక్కి పంపడం ద్వారా ప్రజల్లో తిరగడానికి భయమెందుకనే సంకేతాలు నిచ్చినట్లయింది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలంతా దీనిని ఆదర్శంగా తీసుకుంటే ప్రభుత్వ ఖర్చులూ తగ్గుతాయి. అధికార దర్పంతో కొన్నిచోట్ల అధికారులు, ఉద్యోగులపై విరుకుకుపడుతున్న ఘటనలు ఇటీవల ఎచ్చెర్ల, శ్రీకాకుళంలో చోటు చేసుకుంది. ప్రజలు అధికారమిచ్చింది సేవ చేయడానికే తప్ప అధికార దర్పం ప్రదర్నించడానికి కాదన్న విషయాన్ని గుర్తెరిగి ప్రజా సమస్యల పరిష్కరిస్తే అటువంటి ప్రజాప్రతినిధులను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు.

➡️