చిరంజీవిని విమర్శించే అర్హత సజ్జలకు లేదు

జనసేన అధినేత పవన్‌

సమావేశంలో మాట్లాడుతున్న ప్రకాష్‌రెడ్డి

  • కాపు జెఎసి రాష్ట్ర కన్వీనర్‌ ప్రకాష్‌రెడ్డి

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు మద్దతుగా పిఠాపురంలో ప్రచారానికి వస్తున్న ఆయన సోదరుడు చిరంజీవిపై వైసిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటు అని కాపు జెఎసి రాష్ట్ర కన్వీనర్‌ ఆరేటి ప్రకాష్‌రెడ్డి అన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చిరంజీవిని విమర్శించే అర్హత సజ్జలకు ఎక్కడుందని ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వం కాపులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక అంశాల్లో తీవ్ర నిర్లక్ష్యం చేసిందని చెప్పారు. కాపు కార్పొరేషన్‌, రిజర్వేషన్లను సైతం భ్రష్టుపట్టించిందన్నారు. అభివృద్ధిలో, సంక్షేమంలో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధి కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ భ్రష్టు పట్టించిన ఘనత జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. భూ హక్కు చట్టాన్ని తీసుకొచ్చి రైతుల భూమిని వారికి లేకుండా చేసే కుట్రకు పాల్పడిందని ఆరోపించారు. ప్రజల ఆస్తులకు రక్షణ కరవవుతోందన్నారు. తాత, తండ్రులు సంపాదించిన ఆస్తి పత్రాలపై జగన్‌ ఫొటో ముద్రించడం ఆక్షేపణీయమన్నారు. అన్ని వర్గాల ప్రజలను నిలువునా మోసం చేసిన వైసిపిని ఈ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి ఏసుదాస్‌, టిడిపి నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్‌, చిట్టి నాగభూషణరావు, పాండ్రంకి శంకర్‌, పెద్దిన కవిత తదితరులు పాల్గొన్నారు.

➡️