1 నుంచి ‘స్టాప్‌ డయేరియా’

జూలై ఒకటి నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు స్టాప్‌ డయేరియా

మాట్లాడుతున్న డిఎంహెచ్‌ఒ మీనాక్షి

జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి మీనాక్షి

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

జూలై ఒకటి నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు స్టాప్‌ డయేరియా క్యాంపెయిన్‌ను నిర్వహిస్తున్నట్టు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి తెలిపారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలోని ఆమె ఛాంబరులో బుధవారం విలేకరులతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఈ క్యాంపెయిన్‌లో భాగంగా ప్రతి గ్రామంలో ఎఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పి, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఐదేళ్ల లోపు వయసున్న పిల్లలను నమోదు చేస్తారన్నారని చెప్పారు. వారికి ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, జింకు మాత్రలు అందజేసి చిన్నపిల్లల్లో విరేచనాలు, రాకుండా తీసుకునే జాగ్రత్తలు, నివారణా చర్యలను తల్లిదండ్రులకు వివరిస్తారన్నారు. చేతుల పరిశుభ్రత, తాగేనీరు, తల్లిపాల ప్రాముఖ్యత, భోజనం పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారన్నారు. ఇంట్లోని ఆహార పదార్థాలపై ఈగలు వాలకుండా అన్నింటిపైనా మూతలు పెట్టేలా అవగాహన కల్పించాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, మురుగునీరు నిల్వ లేకుండా గుంతలు పూడ్చేందుకు పంచాయతీ కార్యదర్శులతో సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. డయేరియా ప్రోన్‌ డ్రామాలను (హై ప్రయారిటీ) గ్రామాలను గుర్తించి వాటికి కొంతమంది పర్యేవేక్షకులను మ్యాప్‌ చేసినట్లు తెలిపారు. ఎఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పి, ఆశా కార్యకర్తలు సోమవారం, గురువారం పాఠశాలలు… బుధవారం, శనివారం అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పారిశుధ్యం, చేతుల పరిశుభ్రత , ఆహారపు అలవాట్లపై ఆరోగ్య విద్యను అందిస్తారని వివరించారు. ప్రతి పిహెచ్‌సిలో ఒక ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌, జిల్లాలో అన్ని ఆరోగ్యశాఖల నుంచి పది మంది అధికారులతో కూడిన డిస్ట్రిక్ట్‌ ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. డిఎంహెచ్‌ఒ కార్యాలయంలో 24 గంటల పాటు సేవలందించేందుకు కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు.

 

➡️