పింఛన్ల పంపిణీలో సిఎం -ఒకటిన పెనుమాకలో ప్రారంభం

Jun 29,2024 23:50 #chandrababau, #Pension, #TDP

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో :సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా పాల్గననున్నారు. సిఎం కార్యాలయం తెలిపిన సమాచారం మేరకు ఒకటవ తేదిన మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో జరిగే సామాజిక పింఛన్ల పంపిణీ (ఎన్‌టిఆర్‌ భరోసా)లో సిఎం పాల్గంటారు. ఉదయం ఆరు గంటలకే ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో సిఎం లబ్ధిదారులకు నేరుగా పింఛను అందచేస్తారు. అనంతరం జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు, ప్రజలతో మాట్లాడతారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 65,18,496 మంది లబ్ధిదారులకు రూ.4,399.89 కోట్లు నగదు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎల్‌ఏలు, ఎంపిలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు.
పొరపాట్లకు తావు ఇవ్వకండి : సిఎస్‌
ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా పింఛన్లను సక్రమంగా పంపిణీ చేయాలని రాష్ట్ర ఫ్రభుత్వ ఫ్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ప్రసాద్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. విజయవాడలోని సిఎస్‌ క్యాంపు కార్యాలయం నుంచి శనివారం కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పింఛన్ల పంపిణీకి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటి పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలన్నారు. అవసరమైతే ఇతర విభాగాల సిబ్బంది సేవలను కూడా వినియోగించుకోవాలన్నారు. ఉదయం 6గంటలకే కార్యక్రమం ప్రారంభించాలని, మొదటి రోజే 95శాతానికి పైగా పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలని చెప్పారు. గత ఏప్రిల్‌,మే, జూన్‌ నెలలకు 11 కేటగిరిల్లో పింఛన్‌ దారులకు పెంచిన ఫించన్‌ మొత్తం బకాయిలను కలిపి జూలై నెల పింఛన్‌ రూ.4వేలతో కలిపి పంపిణీచేయాలని సిఎస్‌ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేసిన మొత్తాన్ని శనివారం రాత్రిలోగా విత్‌డ్రా చేసుకోవాలని చెప్పారు. ఏ బ్యాంకైనా డబ్బును శనివారంరాత్రికి ఇవ్వలేకపోతే , ఆ బ్యాంకులు ఆదివారం తెరిచి ఉంచి సంబంధిత పింఛన్‌ సొమ్ము మొత్తాన్ని డ్రా చేసి ఇవ్వాలని చెప్పారు. లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ ఈ దిశలో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్దిశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ మాట్లాడుతూ పించన్ల పంపిణీకి సంబంధించి ఎన్‌టిఆర్‌ భరోసా పింఛన్‌ పథకం నూతన యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. దీనిని పింఛను పంపిణీ అధికారులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో గ్రామవార్డు సచివాలయాల డైరెక్టర్‌ ఎం.శివప్రసాద్‌, ఆర్ధిక శాఖ కార్యదర్శి కెవివి సత్యనారాయణ పాల్గన్నారు.
మాట నిలబెట్టుకుంటున్నాం : బాబు బహిరంగలేఖ
ఏప్రిల్‌ నెల నుండి పింఛను పెంచి ఇస్తామంటూ ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాటను నిలబెట్టుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.ఈ మేరకు లభ్ధిదారులకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖను కూడా పింఛనుతో పాటు లబ్ధిదారులకు అందచేయనున్నారు. ‘మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్‌ ఒకేసారి వెయ్యి పెంచి ఇకపై నెలనెలా రూ.4వేలు ఇవ్వనున్నాం,. అలాగే దివ్యాంగులకు రూ.3వేలు పెంచి రూ.6వేలు, ఇస్తున్నాం.’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు. ‘ఏ ఆశలు, ఆకాంక్షలతో అయితే మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమేతక్షణ, ప్రధమ కర్తవ్యంగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోంది’ అని తెలిపారు.

➡️