కాలువలపై పలకలు తీయరు.. పూడికలు కదలవు 

పట్టణంలోని ప్రధాన కాలువలపై ఉన్న సిమెంట్‌ పలకలతో

వన్‌వే సెంటర్‌ వద్ద చెత్తాచెదారంతో నిండిన కాలువ

దోమలు, ఈగలతో నరకం చూస్తున్న ప్రజలు

మామ్మూళ్ల మత్తులో జోగుతున్న మున్సిపల్‌ అధికారులు

ప్రజాశక్తి- ఆమదాలవలస

పట్టణంలోని ప్రధాన కాలువలపై ఉన్న సిమెంట్‌ పలకలతో పూడికలు కదలక పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న కాలువలపై దుకాణదారులు సిమెంట్‌ పలకలతో పూర్తిగా కప్పేయడం వలన కాలువలు చెత్తా చెదారంతో నిండి పూడికలు పెరిగి కప్పుకు పోవడంతో దుర్గంధం వెదజల్లి కంపుమయంగా మారి దోమలు, ఈగలతో ప్రజలు నానా ఇబ్బందులకు గురవు తున్నారు. పట్టణ ప్రజలు మున్సిపల్‌ అధికారుల పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని వన్వే సెంటర్‌ వద్ద రోడ్డు పక్కన సాయంత్రం వేల తోపుడు బండ్లతో ఫాస్ట్‌ఫుడ్‌ దుకాణాలను రోడ్డు పొడుగునా కొనసాగిస్తున్నారు. చిరుతిళ్లు తినే వ్యక్తులు పేపర్‌ ప్లేట్స్‌ డిస్పోజల్‌ గ్లాసులు వంటి వస్తువులను కాలువల్లో పడేయడంతో చెత్త పేరుకుపోయి అధ్వానంగా మురికి కాలువలు దర్శనమిస్తున్నాయి. వీటిని పర్యవేక్షించాల్సిన మున్సిపల్‌ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పురపాలక సంఘంలో 23 వార్డుల్లో కూడా మురికి కాలువల్లో చెత్త ఎక్కడికక్కడే దర్శనమిస్తూ అపారిశుద్ధ్యం రాజ్యమేలుతున్నది. 23 వార్డులకు 74 మంది పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నప్పటికీ కొంతమంది మేస్త్రీలుగా అవతారం ఎత్తడంతో పారిశుద్ధ్య నిర్వహణ కష్టతరంగా మారుతుంది. ఇదే విషయం పలుమార్లు పారిశుధ్య సిబ్బంది, ఆ సంఘ నాయకులు మున్సిపల్‌ కమిషనర్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ రాజకీయ ఒత్తిడితో ఆ సమస్యపై అధికారుల దృష్టి సారించలేదన్న విమర్శలు విని పిస్తున్నాయి. ప్రతి ఏటా పురపాలక సంఘంలో సింహ భాగం నిధులను పారిశుద్ధ్య నిర్వహణకు వినియోగి స్తున్నప్పటికీ ఆ నిధులు దారి మల్లుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాలకవర్గం లేకపోవడంతో అధికారుల ఇష్టారాజ్యంగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు. రానున్నది వర్షాకాలం కావడంతో ప్రధాన రహదారి పక్కన ఉన్న కాలువలపై పలకలు తీసి పూడికలు తొలగించకపోతే రహదారిపైనే మురికి నీరు ప్రవహించి రహదారి పక్కనే ఉన్న దుకాణ, నివాస సముదాయాల్లోకి మురికి నీరు చొరబడి ఇబ్బందులు పడిన సంఘటనలను ప్రజలు గుర్తు చేస్తున్నారు. మున్సిపల్‌ అధికారులు ఇప్పటికైనా మామూళ్ల మత్తును వీడి చర్యలు తీసుకొని దుర్గంధం, వ్యాధుల భారి నుంచి ప్రజలను కాపాడాలని పట్టణ ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

 

➡️