5న ఓట్‌ ఫ్రమ్‌ హోొం

మే 5 నుంచి ఎనిమిదో తేదీ వరకు నాలుగు రోజుల పాటు

మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

వికలాంగులు, 85 ఏళ్ల పైబడిన వృద్ధులకు అవకాశం

జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

మే 5 నుంచి ఎనిమిదో తేదీ వరకు నాలుగు రోజుల పాటు జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా హోం ఓటింగ్‌ ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ తెలిపారు. హోం ఓటింగ్‌ (ఇంటి నుంచే ఓటు వేసే ప్రక్రియ)కు సానుకూలంగా ఉన్న 85 ఏళ్లు పైబడిన, వికలాంగ ఓటర్ల వివరాలను ఆయా రిటర్నింగ్‌ అధికారుల (ఆర్‌ఒ)కు అందజేయాలన్నారు. ఏ ఒక్కరూ ఓటు వేయలేకపోయామని బాధపడే పరిస్థితి ఉండకూడదన్నదే దీని ప్రధాన ఉద్దేశమన్నారు. జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో ఆర్‌ఒలు, ఎఆర్‌ఒ (తహశీల్దార్లు), సెక్టార్‌ అధికారులు, బిఎల్‌ఒలు, సూపర్‌వైజర్లకు ఓరియంటేషన్‌ కార్యక్రమం నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 13వ తేది నాటికి అర్హులైన వారి జాబితా సిద్ధమవుతుందని, 14వ తేదీన దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. 15, 16, 17 తేదీల్లో 12-డి దరఖాస్తును బిఎల్‌ఒలు స్వయంగా ఆయా ఓటర్ల వద్దకు వెళ్లి అందజేయాల్సి ఉంటుందన్నారు. వీటిని ఈ నెల 22వ తేదీ నాటికి బిఎల్‌ఒలు, సెక్టారు అధికారులు సంయుక్తంగా తిరిగి వెళ్లి ధ్రువీకరణ పత్రాలు స్వీకరించాలన్నారు. హోం ఓటింగ్‌ కావాలో? వద్దో? వారి నుంచి హామీ పత్రం తీసుకోవాలన్నారు. ఓటర్ల జాబితాలో నమోదైన వయసు ఆధారంగా తీసుకుని 85 ఏళ్లు పైబడిన హోం ఓటింగ్‌ కావాలనే వారు, సదరం సర్టిఫికెట్‌లో 40 శాతం పైబడి ఉన్న వికలాంగుల నుంచి మాత్రమే 12-డి ఫారంపై అంగీకార పత్రాలు తీసుకుని ఆర్‌ఒ కార్యాలయానికి నివేదిక అందజేయాలన్నారు. వారందరికీ ఇంటి వద్దనే మే 5 నుంచి 8వ తేదీ వరకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెరిగేందుకు కృషి చేయాలన్నారు. శిక్షణా కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, జిల్లా పరిషత్‌ సిఇఒ డి.వెంకటేశ్వరరావు, పోస్టల్‌ బ్యాలెట్‌ నోడల్‌ అధికారి జి.వి.చిట్టిరాజు, శిక్షణా కార్యక్రమాల సమన్వయకర్తలు బాలాజీ నాయక్‌, ఎం.కిరణ్‌ కుమార్‌, ఇడిఎం చంద్రశేఖర్‌ తదితరులు ఉన్నారు. ఎఆర్‌ఒలు, బిఎల్‌ఒలు మండలాల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

 

➡️