జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం

టిడిపి ప్రభుత్వం అధికారంలోకొస్తే జీడి పంటకు

ప్రచారం చేస్తున్న రామ్మోహన్‌ నాయుడు, గౌతు శిరీష

  • ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

ప్రజాశక్తి – పలాస

టిడిపి ప్రభుత్వం అధికారంలోకొస్తే జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పించి, రైతులకు ఆదుకుంటామని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు హామీనిచ్చారు. మండలంలోని బొడ్డపాడు, మాకన్నపల్లి, నీలావతి, గురుదాసుపురం, మామిడిమెట్టు, లొద్దభద్ర, తర్లకోట పంచాయతీల్లో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీషతో కలిసి శనివారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో జీడి, కొబ్బరి బోర్డులను ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. టిడిపి హయాంలో జీడి పిక్కల బస్తా రూ.14 వేలు ఉంటే, వైసిపి ప్రభుత్వం వచ్చాక బస్తా రూ.ఏడు వేలకు పడిపోయిందన్నారు. రైతులకు రూ.వెయ్యి ప్రభుత్వం నుంచి అందిస్తామని ఇచ్చిన హామీ ఏమైందో చెప్పాలని మంత్రి అప్పలరాజును డిమాండ్‌ చేశారు. ఉద్దాన ప్రాంతంలో యువకుల కోసం డిఫెన్స్‌ అకాడమీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సిల్క్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి అందిచనున్నట్లు చెప్పారు. పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15 వేలు అందిస్తామన్నారు. రైతులకు ఏటా రూ.20 వేలు ఆర్థికసాయం అందిస్తామన్నారు. ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్‌ సిలిండర్లు, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇంటి వద్దకే రూ.నాలుగు వేల పింఛను అందిస్తామని వివరించారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, పిఎసిఎస్‌ మాజీ అధ్యక్షులు దువ్వాడ హేమబాబు చౌదరి, కుత్తుం లక్ష్మణ్‌ కుమార్‌, ఎల్‌.కామేశ్వరరావు, తెలుగు యువత మండల అధ్యక్షుడు కిక్కర ఢిల్లీరావు తదితరులు పాల్గొన్నారు.

➡️