శతశాతం ఓటింగ్‌కు చర్యలు తీసుకోవాలి

పోలింగ్‌ కేంద్రం వద్ద సెక్టార్‌ అధికారి మధుసూదనరావు, సచివాలయ సిబ్బంది

ప్రజాశక్తి -సీలేరు

ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో ఓటర్లు 100 శాతం ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని ఎన్నికల పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌ను సెక్టార్‌ అధికారి మధుసూదనరావు ఆదేశించారు. జికె.వీధి మండలం సీలేరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఒకటి నుంచి ఆరు వరకు పోలింగ్‌ బూతులను, దుప్పిలివాడ పంచాయతీ బూస్కొండ ప్రాథమిక పాఠశాలలో పోలింగ్‌ బూత్‌ను శుక్రవారం సెక్టార్‌ అధికారి మధుసూదనరావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్‌ బూత్‌ల్లో విద్యుత్‌, తాగునీటి సౌకర్యం తదితర ఏర్పాట్లు ముందస్తుగానే చేయాలని సూచించారు. ముందస్తుగానే ఆదివారం సాయంత్రం ఎన్నికల సిబ్బంది సీలేరు చేరుకుంటారని, వారికి వసతి, భోజన సౌకర్యాలు ఏర్పాట్లు చేసి ఎటువంటి సమస్యలు తలెత్తుకుంటూ చూడాలని ఆదేశించారు. పోలింగ్‌ బూతుల్లో బల్లలు, కుర్చీలు పూర్తిస్థాయిలో సమకూర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఎల్‌ఓలు, సీలేరు సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ కుసుమ, మహిళా పోలీస్‌ రేవతి, యానిమల్‌ అసిస్టెంట్‌ అనుష్క, స్వరూప, ఉమా మహేష్‌, జయరాము, స్థానిక పోలీసులు పాల్గొన్నారు.

➡️