ఇంకెన్నాళ్లీ భారం!

అగనంపూడి టోల్‌గేట్‌

27ఏళ్లకు పైగా తిష్టవేసిన అగనంపూడి టోల్‌గేట్‌

నిబంధనలకు విరుద్ధంగా నేటికీ టోల్‌ట్యాక్స్‌ వసూళ్

లుప్రజలు, ప్రజాసంఘాల ఆందోళన పట్టని అధికారులు

ఓట్ల రాజకీయానికి వాడుకుంటున్న వైసిపి, టిడిపి

ప్రత్యక్ష పోరాటం చేసిన సిపిఎం, అనుబంధ సంఘాలు

ప్రపంచబ్యాంకు నిబంధనలను తలొగ్గి, పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ప్రజలు, వాహనదారులపై మోయలేని భారాన్ని మోపుతున్నాయి. జాతీయ రహదారుల నిర్మాణానికి వెచ్చించి వ్యయాన్ని వాహనదారుల నుంచి వసూలు చేసేందుకు ఏర్పాటు చేసిన టోల్‌గేట్‌లు గుదిబండలా మారుతున్నాయి. నిర్ధేశించిన వసూళ్లు, గడువు పూర్తయినా నిబంధనలకు విరుద్ధంగా ఏళ్లతరబడి కొనసాగుతూనే ఉన్నాయి. గ్రేటర్‌ విశాఖ నగర పరిధిలో ఉన్న అగనంపూడి టోల్‌గేట్‌ 27ఏళ్లకు పైగా ప్రజలు, వాహనదారుల జేబులను గుళ్ల చేస్తోంది.

ప్రకాశక్తి-ఉక్కునగరం

జివిఎంసి పరిధలో నిబంధనలను విరుద్ధంగా, ప్రజలు, వాహనదారులకు గుదిబండలా కొనసాగుతున్న అగనంపూడి టోల్‌ప్లాజా ఎత్తేయాలన్న డిమాండ్‌ మరోసారి ఊపందుకుంటోంది. అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.63 కోట్ల రుణం తీసుకుని పనులు పూర్తిచేసింది. ప్రపంచ బ్యాంకు సంస్కరణలకు తలొగ్గి, రోడ్డు నిర్మాణ వ్యయాన్ని ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు, వాహనదారుల నుంచి వసూలుకు ప్పట్లో టిడిపి హయాంలో 1997లో అగనంపూడి వద్ద జాతీయ రహదారిలో టోల్‌గేట్‌ ఏర్పాటు చేశారు. 1998నుంచి వాహనదారుల నుంచి టోల్‌ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ మార్గంలో ప్రయాణించే బస్సుల్లోని ప్రయాణికులను నుంచి కూడా టిక్కెట్లలో కలుపుకుని ముక్కుపిండి వసూళ్లు ప్రారంభించారు.2001 నవంబర్‌ 30 వరకు ఆర్‌అండ్‌బి నిర్వహణలో ఉన్న టోల్‌ప్లాజాను తర్వాత నేషనల్‌ హైవే అథారిటీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. టోల్‌ప్లాజా ప్రారంభించిన మొదటి ఐదేళ్లలోనే రోడ్డు నిర్మాణ వ్యయమంతా వసూలైంది. అయినా నేటికీ దీన్ని కొనసాగిస్తున్నారు. దీనిపై గాజువాక బార్‌ అసోసియేషన్‌ హైకోర్టును ఆశ్రయించగా, వెంటనే టోల్‌గేట్‌ను తొలగించాలని కోర్టు అదేశించింది. ఈ మేరకు అగనంపూడి టోల్‌గేట్‌ను మూసేసి, పరవాడ మండలం సాలపువారిపాలేనికి తరలించారు. దీంతో ఈప్రాంత ప్రజలు, వాహనదారులు ఊపిరిపీల్చుకున్నా, ఆ సంతోషం ఎన్నాళ్లో నిలవలేదు. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేషనల్‌ హైవే అథారిటీ స్టే తెచ్చుకోవడంతో మూడునెలలు తిరక్కుండానే అగనంపూడిలో టోల్‌ప్లాజాను పున:ప్రారంభించారు. ప్రజాందోళన పట్టని అధికారులు, పాలకులుసుప్రీంకోర్టు స్టేతో అగనంపూడి టోల్‌గేట్‌ కార్యకలాపాలను ప్రారంభించడంతో ప్రజలు, ప్రజాసంఘాలు, వాహనదారులు పెద్దఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. సిపిఎం, అనుబంధ సంఘాలు ప్రత్యక్ష పోరాటం చేసినప్పటికీ స్పందన లేదు. ప్రధాన రాజకీయపార్టీలు ఈ అంశాన్ని ఎన్నికల అజెండాగా మార్చుకుని, ఓట్ల రాజకీయాలు కూడా చేశాయి. నిబంధనలకు విరుద్ధంగా నేటికీ నిర్వహణఐదేళ్లలోనే అనుకున్న మొత్తం వసూలైనప్పటికీ అగనంపూడి టోల్‌గేట్‌ నేటికీ కొనసాగిస్తున్నారు. జివిఎంసికి వెలుపల ఏర్పాటుచేసిన టోల్‌గేట్‌, 2005లో నగర పరిధిలోకి వచ్చిన తర్వాత కూడా నిబంధనలకు విరుద్దంగా దీన్ని కొనసాగిస్తున్నారు. దీంతో నగరపరిధిలోని ఒక ప్రాంతం నుంచి మరోప్రాంతాన్ని సొంత వాహనాలు, బస్సుల్లో వెళుతున్న వారు సైతం టోల్‌ట్యాక్స్‌ కట్టక తప్పడం లేదు. నగర పరధిలోనే నివాసముంటున్న స్టీల్‌ప్లాంట్‌, ఫార్మా, ఇతర కంపెనీలు, సంస్థల ఉద్యోగులు విధి నిర్వహణకు, పొరుగు ప్రాంతాలకు వెళ్లాలంటే టోల్‌గేట్‌ను దాటే క్రమంలో రోజూ అటూ, ఇటూ రెండువైపులా ట్యాక్స్‌ భారం పడుతోందని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు వెళ్లే నాలుగు లైన్ల జాతీయరహదారి ప్రాజెక్టు పూర్తికావడం, అక్కడ కూడా టోల్‌ప్లాజాను ప్రారంభించిన నేపథ్యంలో అగనంపూడి టోల్‌గేట్‌ను ఇప్పటికైనా ఎత్తేయాలని నగరవాసులు ఎంతగా మొరపెట్టుకున్నా పట్టించుకునే దిక్కులేదు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నేషనల్‌ హైవే అథారిటీ దీనిపై దృష్టి పెట్టి, గడువు దాటినా కొనసాగుతున్న అగనంపూడి టోల్‌గేట్‌ను ఎత్తేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

టోల్‌గేట్‌ కొనసాగింపు దారుణం

గ్రేటర్‌ విశాఖ నగర పరిధిలో కొనసాగుతున్న అగనంపూడి టోల్‌గేట్‌ తొలగించాలని ఎన్నోసార్లు జివిఎంసి పాలకమండలి సమావేశాల్లో ప్రస్తావించా. నగర మేయర్‌కు, కమిషనర్‌కు లేఖ రాసాను.2005లో టోల్‌గేట్‌ ప్రాంతం జివిఎంసిలో విలీనం కావడంతో నిబంధనల మేరకు నగర పరిధిలో ఉండకూడదని పలుమార్లు ప్రశ్నించినా స్పందన లేదు. 2019లో నేషనల్‌ హైవే అథారిటీ సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకుని కొనసాగిస్తున్న నేపథ్యంలో న్యాయపరంగానే దీన్ని తొలగించేందుకు ఎటువంటి చర్యలు లేకపోవడం విచారకరం. టోల్‌గేట్‌ ఆవిర్భావం నుంచి నేటివరకు నిరాటంకంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. నేడు సగటున రోజుకు రూ.20లక్షలు చొప్పున టోల్‌ట్యాక్స్‌ వసూళ్లతో గడచిన 27ఏళ్లలో ప్రజలు, వాహనదారులను నిలువుదోపిడి చేశారు. కేంద్రప్రభుత్వ దన్నుతో కొనసాగుతున్న టోల్‌గేట్‌ ఎత్తేయకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేేస్తాం.

డాక్టర్‌ బి.గంగారావు, జివిఎంసి 78వ కార్పొరేటర్‌ (సిపిఎం)

➡️