వేతన బకాయిలు చెల్లించకుంటే సమ్మె

పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న పారిశుధ్య కార్మికులు

ప్రజాశక్తి -కశింకోట

కశింకోట మేజర్‌ పంచాయతీ పరిధిలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఐదు నెలలుగా బకాయి పడ్డ వేతనాలను తక్షణమే చెల్లించాలని, లేకుంటే సమ్మెలోకి వెళ్తామని బాధిత కార్మికులు హెచ్చరించారు. వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ ఎపి గ్రామపంచాయతీ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన కసింకోట పంచాయతీ వద్ద పారిశుధ్య కార్మికులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కె.రామాజీ, జి.వెంకటరమణ, కోశాధికారి కె.దేవుడు, సిఐటియు జిల్లా నాయకులు దాకారపు శ్రీనివాసరావు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు ఈ ఏడాది జనవరి నుండి వేతనాలు చెల్లించలేదని, ఇలా అయితే కార్మికుల కుటుంబాలు ఎలా జీవిస్తాయని ప్రశ్నించారు. పారిశుధ్య కార్మికులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పారిశుధ్య పనులు నిర్వహిస్తూ పంచాయతీని పరిశుభ్రంగా ఉంచుతున్నారని, అయినా ప్రభుత్వాలు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత సామాజిక తరగతికి చెందిన పారిశుధ్య కార్మికుల పట్ల ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం తగదన్నారు. ప్రతి నెలా వేతనాలు అందకపోవడం వలన వడ్డీలకు అప్పులు తెచ్చి, వాటిని తీర్చలేక కుటుంబాన్ని పోషించుకోలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. కరోనా తర్వాత ఇప్పటివరకు చేతి గ్లౌజులు, నూనెలు, సబ్బులు, యూనిఫారాలు, పనిముట్లు ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వానికి తమ సమస్యను విన్నవించి ఇప్పటివరకు రావలసిన ఐదు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓ.అప్పారావు డి.సూర్య అప్పారావు, ఈ.అర్జునమ్మ, ఈ.ఆదిలక్ష్మి, ఇతర కార్మికులు పాల్గొన్నారు.

➡️