ఖరీఫ్‌ సాగుకు వేసవి దుక్కులు మేలు

May 22,2024 21:08

ప్రజాశక్తి – సీతంపేట : మరికొద్ది రోజుల్లో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కానుంది. సాధారణంగా కొంతమంది రైతులు వేసవి పంటలు కోసిన తర్వాత పొలం దున్నకుండా ఉండడం వల్ల ఖరీఫ్‌ సీజన్లో వేసే పంటలకు తగిన మొత్తంలో వేసవికాల లభ్యత అందదు. తద్వారా రైతులు ఆశించిన పంట దిగుబడి పొందలేరు. ఇందుకు గాను వేసవిలోనే దుక్కులు దున్నడం ఎంతో ప్రయోజనమైని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. (లోతుగా దుక్కులు వానాకాలానికి అనుకూలంగా ఉంటుందని, కావున లోతుగా దుక్కుల మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సీతంపేట ఏజెన్సీలో కొంతమంది రైతులు తమ పొలాల్లో దుక్కులు దున్నుతున్నారు. ఈ సమయంలో దుక్కు దున్నడం వల్ల నేల స్థూల సాంద్రత తగ్గడం జరుగుతుంది. నేలలో గాలి ప్రసరించి గుణం పెరుగుతుంది. లోపలి పొరల్లో ఉన్న పోషకాలు నేల ఉపరితలానికి చేరి ఆ తర్వాత పంట లభ్యత పెరుగుతుంది. లోతుగా దున్నుకోవడం ద్వారా వాన నీరు భూమిలోకి ఇంకెందుకు అనుకూలంగా ఉండడంతో పాటు భూమి ఎక్కువ తేమను గ్రహించి నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. దీని ప్రభావం తర్వాత పంట దిగుబడిపై చూపుతుంది. పంట కోత అనంతరం పంట అవశేషాలు సేంద్రీయ అభివృద్ధి చెంది భూసారం అభివృద్ధి చెందుతుంది. దీని ద్వారా నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి తర్వాత పంటకు వేసే ఎరువులు వినియోగ సామర్థ్యం పెరిగి పంట దిగుబడి పెరుగుతుంది. వేసవిలో లోతుగా దుక్కులు దున్ని తొలకరి జల్లులు కురిసిన తర్వాత గొర్రు తిప్పి సేద్యం చేస్తే వేర్లు బాగా విస్తరించడానికి అనుకూలంగా ఉంటుంది. నేల అధికంగా నీటిని పీల్చు కుంటుంది. సేద్యానికి ఉపయోగించే గొర్రు గుంటక నాగలి వంటి పరికరాలు లోపలికి మూడు నుంచి ఆరు అంగుళాల వరకు చొచ్చుకు పోతాయి. ఈ పరికరాలు ఉపయోగించడం వల్ల నేల లోపల సుమారు మూడు నుంచి ఐదు అంగుళాల లోతులో ఒక గట్టి పొర ఏర్పడుతుంది. దీంతో నేలకు నీటిని పీల్చుకునే శక్తి తగ్గుతుంది. కావున వేసవి దుక్కుల సమయంలో నేలను లోతుగా దుండినప్పుడు గట్టిపొర చేధించబడి నేలకు నీటిని పీల్చుకునే శక్తి అధికమవుతుంది. మొండి జాతి మొక్కలు పొలంలో అధికంగా పెరిగి పంటలను నాశనం చేస్తుంటాయి. వేసవి దుక్కులు లోతుగా తీయడంతో పొలంలోని చీడలు నాశనమయ్యే అవకాశం ఉన్నందున రైతులు వ్యవసాయ అధికారులు సూచనల మేరకు జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.పంట కోతల తర్వాత నేలపై మిగిలే పంట మొదలు పొలంలో మిగిలిన కలుపు మొక్కలు పంట నుంచి రాలి పడిన ఆకుల వంటి వివిధ సేంద్రియ పదార్థాలన్నీ లోతుగా కిందపడినప్పుడు నేలలో కలిసి కుళ్లిపోయి సేంద్రియ పదార్థాలు పోషక విలువలు పెరగడానికి అవకాశం ఉంటుంది. లోతు దుక్కులు దున్ని సిద్ధం చేసుకుంటే వానకాలానికి ఎంతో అనుకూలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పొలాల్లో గొర్రెలు మంద మంచిదిపొలాల్లో ఎలాంటి పంటలు ఉండవు. వేసవిలో పశువులు, గొర్రెలు మందలు వేసుకుంటే రైతులకు ఎంతో మంచిది.. పశువుల మల విసర్జన వల్ల భూమికి సారం పెరుగుతుంది.

కొండ ప్రాంతాల్లో అడ్డదుక్కులు వేసుకోవాలి

కొండ ప్రాంతాల్లో రైతులు అడ్డంగా దున్నుకోవాలి. అప్పుడే నేల కోతకు గురికాకుండా ఉంటుంది. లోతుగా దుక్కులు దున్నడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. లోతు దుక్కుల వల్ల లోపల చీడపీడలు, తెగుళ్లు, సూర్యరశ్మి వల్ల నాశనమవుతాయి. కలుపు మొక్కలు తగ్గుతాయి పంట అధిక దిగుబడి వస్తుంది. దీంతో రైతులకు ఎంత మేలు జరుగుతుంది.

పి.సీతారాం, సీనియర్‌ శాస్త్రవేత్త ,

ఎన్‌జి రంగా వ్యవసాయపరిశోధన స్థానం

పాత పనుకువలస, సీతంపేట మండలం

➡️