ఆటోనగర్‌ ప్రమాదంపై టిడిపి అసత్య ప్రచారం

May 7,2024 00:44

మాట్లాడుతున్న కిలారి రోశయ్య
ప్రజాశక్తి-గుంటూరుజిల్లా ప్రతినిధి :
ఆటోనగర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై టిడిపి నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని వైసిపి గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య అన్నారు. గుంటూరులోని తన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ తాము మంచి చేశానని భావిస్తేనే ఓటేయమని అభ్యర్థిస్తూ వైసిపి అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తుంటే టిడిపి నాయకులు అసత్యాలను, అబద్దాలను ప్రచారం చేస్తూ గెలుపుకోసం అడ్డదారులు తొక్కుతున్నారని విమర్శించారు. ఆదివారం గుంటూరు ఆటోనగర్‌లో గాలికి కరెంట్‌ తీగలు తెగి అక్కడ ఉన్న ప్లాస్టిక్‌ వ్యర్ధాలపై నిప్పు రవ్వలు పడి అగ్నిప్రమాదం సంభవిస్తే టిడిపి నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఘటన జరిగిన వెంటనే తమపార్టీ అభ్యర్థి నూరిఫాతిమా ఆటోనగర్‌కు చేరుకుని ఫైర్స్‌ సిబ్బందిని అప్రమత్తం చేసి బాధితులు అండగా నిలిచిన సందర్భాన్ని గ్రహించా లన్నారు. రెండ్రోజుల క్రితం ఆటోనగర్లో జరిగిన వైసిపి ఆత్మీయ సమావేశం విజయవంతం కావడంతో దానిని తట్టుకోలేక టిడిపి వారు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పెమ్మసాని తనపై చేస్తున్న మైనింగ్‌ అసత్య ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని, ఆరోపణలను నిరూపిస్తే తాను తన ఆస్తి మొత్తాన్ని రాసిస్తానని పెమ్మసాని చంద్రశేఖర్‌కు సవాల్‌ విసిరారు. అమెరికా నుండి డబ్బులతో వచ్చి రాజకీయాల చేయాలని చూస్తే అది సాగే పని కాదన్నారు. సమావేశంలో వైసిపి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి నూరిఫాతిమా, నాయకులు జియావూల్‌ రెహమాన్‌, గులాం రసూల్‌ పాల్గొన్నారు.

➡️