యువతలో కళా ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యం

నక్షత్ర ద స్టార్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : రాష్ట్ర వ్యాప్తంగాయువతలో ఉన్న కళాప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా నక్షత్ర ద స్టార్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎయు విసి ఆచార్య పివిజిడి ప్రసాదరెడ్డి తెలిపారు. శుక్రవారం ఎయు పూర్వ విద్యార్థుల సంఘం సమావేశ మందిరంలో విలేకరుల సమావేశంలో కార్యక్రమ వివరాలతో కూడిన పోస్టరును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎయు విసి మాట్లాడుతూ మానవ సంబంధాల బలోపేతానికి కళలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ దిశగా యువతను నడిపించడానికి, వారిలోని ప్రతిభను ప్రోత్సహించడానికి తొలి ప్రయత్నంగా దీనిని చేపడుతున్నామన్నారు. ఫైనల్‌ కార్యక్రమాన్ని విశాఖలో నిర్వహిస్తామన్నారు. ఎయు ఆర్ట్స్‌,కామర్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య ఎ.నరసింహారావు మాట్లాడుతూ ఎంటర్‌టైన్‌మెంట్‌ క్యూబ్‌ నెట్‌వర్క్స్‌ సంస్థతో సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. జూనియర్‌, సీనియర్‌ విభాగాలుగా మ్యూజిక్‌, డాన్స్‌, ఆర్ట్స్‌ మూడు అంశాలలోపోటీలు జరుగుతాయన్నారు. ఎటువంటి ప్రవేశ రుసుము లేకుండా, అన్ని వయసుల వారు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నామన్నారు.కార్యక్రమం నిర్వాహకులు, నటుడు షాహిద్‌ అబ్దుల్‌ మాట్లాడుతూ ఎపి, తెలంగాణ రాష్ట్రాలలో దీనిని నిర్వహిస్తున్నామన్నారు. ఎపిలో జూన్‌ 15 వరకు , తెలంగాణలో జూన్‌ 17 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తామన్నారు. రెండు దశల్లో ప్రతిభను గుర్తించి, విజేతలుగా నిలచిన వారికి ఫైనల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తామన్నారు. పూర్తి వివరాలకు ద స్టార్‌ ఆఫ్‌ ఇండియా ఇన్‌స్టా పేజ్‌ను సందర్శించాలని సూచించారు. ఫైనల్‌ పోటీలకు న్యాయనిర్ణేతలుగా సంగీత దర్శకుడు రఘు కుంచె హాజరవుతారు. అరుదైన గ్రామీణ కళలను సైతం వెలికితీసి ప్రోత్సహించడం కార్యక్రమం లక్ష్యమన్నారు. విద్యార్థి వ్యవహారాల డీన్‌ ఆచార్య ఎన్‌. విజరు మోహన్‌ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో టాంలెంట్‌ హంట్‌ చేసే విధంగా నక్షత్ర ద స్టార్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. కళలకు నిలయంగా నిలచే ఎయుయ దీనిలో భాగమవుతుందని వెల్లడించారు.

నక్షత్ర ద స్టార్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న విసి

➡️