విద్వేషాలను రెచ్చగొడుతున్న బిజెపిని ఓడించాలి

మాట్లాడుతున్న శ్రీరామ్‌, చిత్రంలో తేలయ్యబాబు, నూకప్పారావు

ప్రజాశక్తి- అనకాపల్లి

దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని, బిజెపి అభ్యర్థులను ఎన్నికల్లో ఓడించాలని సిపిఎం అనకాపల్లి మండల కన్వీనర్‌ గంటా శ్రీరామ్‌ జిల్లా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ దేశంలో 50 శాతం ఎన్నికలు పూర్తికాగా, బిజెపి ఓటమి చెందుతుందని భావిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌ షా మతతత్వాన్ని, విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అనకాపల్లి పార్లమెంటు బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్‌ ఎలాగైనా గెలవడం కోసం బయట నుండి వేలాది మందిని తీసుకొచ్చి జిల్లాలో గొడవలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే చోడవరం, దేవరాపల్లి, కె.కోటపాడు మండలాల్లో అల్లర్లు సృష్టించారని గుర్తు చేశారు. జిల్లాలోని ఫార్మా కంపెనీలు, ఎస్‌ఇజెడ్‌, ఎన్‌ఓబి, ఖనిజ సంపదను దొచుకోవడానికే సీఎం రమేష్‌ అనకాపల్లి నుండి పోటీ చేస్తున్నారని, ఆయనను గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని దోచుకుంటారని తెలిపారు. అందుకే ఆయన గెలవడం కోసం కోట్ల రూపాయలు మంచినీళ్లలాగ ఖర్చు చేస్తున్నారని, దీనిని ప్రజలందరూ గమనించాలని కోరారు. బ్యాంకులను దోపిడీ చేసి వేలాది కోట్లు దిగ మింగిన రమేష్‌పై లెక్కకు మించిన క్రిమినల్‌ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మొద్దని హితవుపలికారు. విశాఖ స్టీల్‌ ఫ్యాంట్‌ ప్రైవేటీకరణ చేసేది లేదని మోడీ చేత ఒక్క ముక్క కూడా చెప్పించలేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం అమ్మేసి భారతదేశాన్ని దివాళా తీయిస్తున్న బిజెపిని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం మండలం కమిటీ సభ్యులు కాళ్ళ తేలయ్యబాబు, బుగిడి నూకప్పారావు పాల్గొన్నారు.

➡️