ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపుతోనే రాజ్యాంగానికి రక్షణ

Apr 17,2024 22:13

 అరకు పార్లమెంట్‌ సిపిఎం అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స

పాలకొండలో ర్యాలీ 19న నామినేషన్‌

రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రాక

తరలిరావాలని నాయకుల పిలుపు

ప్రజాశక్తి-పాలకొండ, సీతంపేట, పార్వతీపురం :  రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాపాడుకోవాలంటే సిపిఎం, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించి బిజెపి, దాని పొత్తు, తొత్తు పార్టీలకు గుణపాఠం చెప్పాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. సిపిఎం అరకు పార్లమెంట్‌ అభ్యర్థి పి.అప్పలనర్స బుధవారం పార్వతీపురం సుందరయ్య భవనంలో విలేకర్ల సమావేశంలోను, సీతంపేట మండల కేంద్రంలో నిర్వహించిన పరిచయసభలోను, పాలకొండ సభలోను మాట్లాడారు.. పాలకొండలో ఆర్‌టిసి కాంప్లెక్స్‌ ఆవరణ నుంచి ఏలం జంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అప్పనర్సతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ, సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి మాట్లాడారు.అప్పలనర్స మాట్లాడుతూ బిజెపికి ఈ ఎన్నికల్లో 400 స్థానాలు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని బహిరంగంగానే చెబుతున్నారని అన్నారు. రిజర్వేషన్లు ఉన్నా పాలకుల విధానాల ఫలితంగా దళిత, గిరిజన, మైనార్టీలు నేటికీ వెనుకబాటుకు గురవుతున్నారని తెలిపారు. ఇలాంటి తరుణంలో రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లు ఎత్తేయాలని చూడటం దారుణమన్నారు. బిజెపి అంటే బాబు, జగన్‌, పవన్‌ కళ్యాణ్‌ అని, వీరు దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయరని అన్నారు. ఉత్తరాంధ్రను గత టిడిపి, ప్రస్తుత వైసిపి ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. పాలకొండ మండలంలో జంపర కోట రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తి చేయాలని తోటపల్లి ఎడమ కాలువ ఆధునీకరణ పనులు చేపట్టాలని, పాలిటెక్నిక్‌ కాలేజ్‌ ఏర్పాటు చేయాలని, రైతు బజారు నిర్మాణం మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. వీరఘట్టాం మండలంలో కుంబిడి ఇచ్చాపురం రిజర్వాయర్‌ నిర్మాణం చేయాలని, 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని, భామిని మండలంలో ఎత్తిపోత పథకం ద్వారా సాగునీరు అందించాలని కోరారు.సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ బిజెపితో వైసిపి, టిడిపి జతకట్టడం సిగ్గుమాలిన చర్య అన్నారు రాష్ట్ర భవిష్యత్‌ కోసం నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన పోరాడుతున్న సిపిఎం అభ్యర్థి అప్పలనర్స ప్రజాసేవకులని, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమని అన్నారు.ఇండియా వేదిక తరుపున పోటీచేస్తున్న పాలకొండ అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎస్‌.చంటిబాబును, అరకు పార్లమెంటు సిపిఎం అభ్యర్థి అప్పలనర్సను గెలిపించాలని కోరారు. రాష్ట్ర హక్కులను కూడా రాబట్టకపోవడం దౌర్భాగ్యం సిపిఎం సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర సమస్త సంపదతో కూడిన హక్కులను బిజెపి ప్రభుత్వం కొల్లగొడుతూ హరిస్తుంటే గత టిడిపి గాని, నేటి వైసిపి గాని ఖండించకపోవడం అన్యాయమని అన్నారు. మోడీ దేశానికి ద్రోహం చేస్తుంటే టిడిపి వైసిపి జనసేన రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని, దీన్ని ప్రజలందరూ తీవ్రంగా ఖండించాలని, సిపిఎం ఇండియావేదిక అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.19న అప్పలనర్స నామినేషన్‌సిపిఐ, కాంగ్రెస్‌ ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం అరకు పార్లమెంటు అభ్యర్థి పి.అప్పలనర్స ఈనెల 19న ఉదయం 10గంటలకు నామినేషన్‌ వేస్తారని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డివేణు తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు పాతబస్టాండ్‌ వద్ద బహిరంగ సభ నిర్వహించి, అనంతరం కలెక్టరేట్‌ వరకు ప్రదర్శనగా చేరుకొని నామినేషన్‌ వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్రకార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. కార్మికులు కర్షకులు, గిరిజనులు, మేధావులు, అభ్యుదయవాదులు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమాల్లో శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యదర్శి డి.గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి మన్మధరావు, సిపిఎం నాయకులు కె.నాగమణి, కె.మోహన్‌ రావు. సిహెచ్‌ అమ్మన్నాయుడు, గంగరాపు సింహాచలం, ఆరిక భాస్కరరావు, దావాల రమణారావు, సూరయ్య, కె.నాగమణి, బి.శ్రీను, శిర్ల ప్రసాద్‌, దారపాడు సర్పంచ్‌ సుందరమ్మ, డుంబు తేజేశ్వరరావు, కాంగ్రెస్‌ నాయకులు బిడ్డిక శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

➡️