అరాచక పాలనకు రోజులు దగ్గరపడ్డాయి

ప్రజాశక్తి – జమ్మలమడుగు/చాపాడు వైసిపి అరాచక పాలనకు పాలనకు రోజులు దగ్గర పడ్డాయని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల అన్నారు. శుక్రవారం జమ్మలమడుగు, మైదుకూరు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో షర్మిల మాట్లాడుతూ రాష్ట్రంలో 10 ఏళ్లుగా విభజన హామీలు ఒక్కటి కూడా వెరవేరలేదన్నారు. మొదటి 5 ఏళ్లు బాబు, తర్వాత జగన్‌ మోసం చేశారని తెలిపారు. కడప స్టీల్‌ ప్రాజెక్ట్‌ శంకుస్థాపన ప్రాజెక్ట్‌గా మార్చారన్నారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ వచ్చి ఉంటే లక్షల్లో ఉద్యోగాలు ఉండేవని తెలిపారు. కడప స్టీల్‌ కోసం ఏనాడూ ఉద్యమం చేసిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రుణమాఫీ చేసిన పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటన చేసిన పార్టీ అని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని చెప్పారు. బాబు, జగన్‌ హోదా మీద మోసం చేశారని తెలిపారు. కనీసం రాజధాని కూడా కట్టలేక పోయారన్నారు. జగన్‌ ప్రభుత్వం ధరలు, ఛార్జీలు, పన్నులు పెంచి ప్రజల రక్తం తాగుతున్నాడన్నారు. ధరల వాత, ఛార్జీల మోత అన్న చందంగా జగన్‌ పాలన తయారైందన్నారు. మద్యం, ఇసుక, సిమెంట్‌, పెట్రోలు, డీజిల్‌, నిత్యావసర వస్తువులు ధరలు పెంచడంతో పాటు ఆర్టీసీ, విద్యుత్‌ ఛార్జీలు ద్వారా 5 సంవత్సరాల్లో జగన్‌ ప్రభుత్వం ప్రజలపై రూ.3 లక్షల కోట్లు అదనపు భారం మోపిందన్నారు. జగన్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చింది గోరంత లాక్కొన్నది కొండంతన్నారు. వైసిపి ఇచ్చిన ఇళ్లు పిచ్చుక గుళ్లుతో సమానమన్నారు. ఒక కుటుంబం కాపురం చేయడానికి ఇళ్లు పనికిరావని పేర్కొన్నారు. నమ్మించి మోసగించడం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య అని తెలిపారు.. రైతులను, రైతు కూలీలను, మహిళలను, మందు బాబులను, ఉద్యోగులను, ఆగ్రిగోల్డ్‌ బాధితులను, సర్పంచులను, కాంట్రాక్టులను ఇలా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు మోసం చేశారన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మైదుకూరు అసెంబ్లీ అభ్యర్థి గుండ్లకుంట శ్రీరాములు, సిపిఎం, సిపిఐ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

➡️