మత్స్యకార సొసైటీ ఎన్నికలను బ్యాలెట్‌ పద్ధతిలో నిర్వహించాలి

మత్స్యకార జెఎసి

మత్స్యకార జెఎసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోదండరాం

ప్రజాశక్తి -నక్కపల్లి : మత్స్యకార సొసైటీ ఎన్నికల్లో చేతులెత్తే ఓటింగ్‌ పద్ధతిని రద్దుచేసి, బ్యాలెట్‌ నమూనా ద్వారా ఎన్నికలు నిర్వహించాలని మత్స్యకార జెఎసి రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ పిక్కి కోదండరాం కోరారు. ఆదివారం మాట్లాడుతూ మత్స్యకార సొసైటీ ఎన్నికలు చేతులెత్తే ఓటింగ్‌ విధానం ద్వారా జరపడం వలన అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.ఈ విధానం వలన సొసైటీ ఎన్నికల్లో పాల్గొనేందుకు మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.చేతులెత్తే విధానం ఓటింగ్‌ వలన ఎవరు, ఎవరికి ఓటేస్తున్నారో బహిర్గతం అవుతుందని , దీనివల్ల మత్స్యకార కుటుంబాల్లో గొడవలు చోటు చేసుకుంటున్నాయన్నారు .ఇప్పటికే ఆయా గ్రామాల్లో జరిగిన గొడవలు పడ్డ మత్స్యకారులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని గుర్తు చేశారు. గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు నెలకుంటున్నాయన్నారు. చేతులెత్తే ఓటింగ్‌ విధానాన్ని రద్దుచేసి, బ్యాలెట్‌ ఓటింగ్‌ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర మత్స్యకార సహకార శాఖ ఎన్నికల అధికారికి లేఖ రాశామన్నారు. కార్యక్రమంలో మత్స్యకార జెఎసి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు అర్జల్లి శ్రీను, నక్కపల్లి మండల యూత్‌ కార్యదర్శి గరికిన జగదీష్‌ పాల్గొన్నారు.

లేఖ చూపిస్తున్న మత్స్యకార జెఎసి నేతలు

➡️