బిసి ఓటర్లపైనే అభ్యర్థుల భవితవ్యం

Apr 12,2024 21:20

ప్రజాశక్తి – పాలకొండ : పాలకొండ ఎస్‌టి నియోజకవర్గమైనా అభ్యర్థి భవితవ్యాన్ని నిర్ణయించేంది బిసి సామాజికవర్గానికి చెందిన వారే. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గం తొలుత ఎస్‌సి రిజర్వుడు కాగా, 2009 నియోజకవర్గాల పునర్‌విభజనలో భాగంగా ఎస్‌టిలకు రిజర్వు అయ్యింది. నియోజకవర్గ పరిధిలో పాలకొండ, వీరఘట్టం, భామిని, సీతంపేట మండలాలు ఉన్నాయి. నియోజకవర్గ పరిధిలో 2,45,553 మంది జనాభా ఉండగా వీరఘట్టంలో 65,616 మంది, సీతంపేటలో 55,848 మంది, భామినిలో 44,157 మంది, పాలకొండ మండల పరిధిలో 54,212 మంది పాలకొండ నగర పంచాయతీ పరిధిలో 20,760 మంది జనాభా ఉన్నారు. నాలుగు మండలాల పరిధిలో 295 పోలింగ్‌ కేంద్రాల్లో 1,94,220 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 94,554 మంది ఉండగా, మహిళలు అధికంగా 99,651 మంది ఓటర్ల ఉన్నారు. అలాగే ట్రాన్స్‌ జెండర్స్‌ 15 మంది ఉన్నారు. 2009లో నియోజకవర్గ పునర్విభజనతో పాలకొండ ఎస్టీలకు రిజ్వర్‌ కేటాయించారు. అప్పట్లో కాంగ్రెస్‌ అభ్యర్థి నిమ్మక సుగ్రీవులు టిడిపి అభ్యర్థి నిమ్మక గోపాలరావుపైనా, 2014లో వైసిపి అభ్యర్థి వి.కళావతి టిడిపి అభ్యర్థి నిమ్మక జయకృష్ణపై విజయం సాధించారు.2019 ఎన్నికల్లో పాలకొండ నియోజకవర్గంలో వైసిపి గాలి పెరిగిందని చెప్పవచ్చు. వైసిపి అభ్యర్థి కళావతికి 72,054 ఓట్లు రాగా, టిడిపి అభ్యర్థి నిమ్మక జయకృష్ణకు 54,034 ఓట్లు వచ్చాయి. సిపిఐ అభ్యర్థి డివిజి శంకరరావుకు 3,343 ఓట్లు రాగా, బిజెపి అభ్యర్థి సునీతకు 1,169ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి హిమరక ప్రసాద్‌కు 1,001ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో నోటాకు ఓటర్లు మొగ్గు చూపారని చెప్పవచ్చు. 3,549 ఓట్లతో మూడో స్థానం దక్కడంతో నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. అయితే ఈసారి ఎన్నికల్లో ఓటర్లు ఏ విధమైన తీర్పును ఇస్తారో ఎవరికీ అంతు పడడం లేదు. మూడో సారికూడా వైసిపి అభ్యర్థి, సిటింగ్‌ ఎమ్మెల్యే కళావతి రంగంలో దిగారు. అయితే పొత్తుల్లో భాగంగా సీటు జనసేనకు కేటాయించడంతో ఉమ్మడి అభ్యర్థిగా మళ్లీ జయకృష్ణే బరిలో తలపడనున్నారు.

ఆశలన్నీ సీతంపేటపైనే..

పాలకొండ నియోజకవర్గంలో నాలుగు మండలాలుండగా, సీతంపేట మండలంపైనే ప్రధాన పార్టీలు ఆశలన్నీ పెట్టుకున్నాయి. గత రెండు సార్లు ఎన్నికల్లో వైసిపి గెలుపునకు సీతంపేట నుంచే అత్యధిక మెజార్టీ రావడంతో ఆ మండలంపైనే అందరి దృష్టి పడిరది. 2014 ఎన్నికల్లో స్వల్ప మెజార్టీ 1620 ఓట్లతో వైసిపి అభ్యర్థి కళావతి విజయం సాధించగా, సీతంపేట మండల ఓటర్లే గట్టెక్కించారని భావించారు. 2019 ఎన్నికల్లో కూడా 19 వేల మెజార్టీ వచ్చినప్పటికీ సీతంపేట నుంచి ఎక్కువ శాతం ఓట్లు వచ్చాయని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అయితే టిడిపి కూడా సీతంపేట కేంద్రంగానే రాజకీయాలు చేస్తోంది. ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి మొగ్గు చూపుతారో చూడాలి.

➡️