ఉద్యోగుల చేతుల్లో..అభ్యర్థుల భవితవ్యం

May 10,2024 20:48

విజయనగరం నియోజకవర్గంలో ఉద్యోగుల ఓట్లు అసెంబ్లీ అభ్యర్థుల గెలుపు, ఓటమిని శాసిస్తాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. జిల్లా కేంద్రం కావడంతో ఎక్కువ మంది ఉద్యోగులు విజయనగరంలో నివాసముంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్న వారితో పాటు పిల్లలు చదువు కోసం ఇతర నియోజకవర్గాల నుంచి ఇచ్చి ఉంటున్నారు. ఈ ఎన్నికల్లో వీరంతా అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశించనున్నారు.

ప్రజాశక్తి-విజయనగరం : టౌన్‌ హోరాహోరీ పోటీ జరుగుతున్న విజయనగరంలో ఉద్యోగుల ఓట్లు కీలకం కానున్నాయి. జిల్లా కేంద్రంలో కలెక్టర్‌ కార్యాలయం తో పాటు వివిధ శాఖలు, ఇంజినీరింగ్‌ శాఖలు,మున్సిపల్‌ ఉద్యోగులు, సచివాలయం సిబ్బంది, పోలీస్‌లు అధికంగా ఉండటంతో ఇప్పుడు అభ్యర్థులంతా వారిపైనే ఆశలు పెట్టుకున్నారు. విజయనగరం నియోజకవర్గంలో 2,57,205 మందిఓటర్లు ఉంటే వారిలో పురుషులు 1,24,829 మంది, మహిళలు 1,32,347 మంది ఉన్నారు. ట్రాన్స్‌ జెండర్లు 29 మంది ఉన్నారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న 3975 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇతర జిల్లాల వారితో కలిపి 4212, మంది వరకు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులతో పాటు రిటైర్డు ఉద్యోగులు, అత్యవసర సేవలు అందించే ఉద్యోగుల కుటుంబాలతో కలిపి సుమారు 15వేల నుంచి 20వేల ఓట్లు ఉంటారని అంచనా. దీంతో ఉద్యోగుల ఓట్లు కోసం అభ్యర్థులు నానా పాట్లు పడుతున్నారు. నోటిఫికేషన్‌ వచ్చిన నుంచి వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే వైసిపి, టిడిపి అభ్యర్థులు పెన్షనర్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఇటీవల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు కోసం కూడా ఉద్యోగులకు డబ్బులు పంపిణీ చేసినట్లు తెలిసింది. డిన్నర్‌ వంటి వాటికి పిలిపించి మననం చేసుకున్నారు. ఉద్యోగులు ఎక్కువగా ఉండే ఉడాకాలనీ, కామాక్షి నగర్‌, కాలిఘట్‌ కాలనీ, కెఎల్‌ పురంలో రెవెన్యూ కాలనీ, బాబా మెట్ట, కామాక్షి నగర్‌, ప్రదీప్‌ నగర్‌ వంటి ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులు ఇళ్లకు వెళ్లి వారి ఓట్లు కోసం అర్థిస్తున్నారు. ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఉద్యోగులు అధికార పార్టీపై కోపంతో ఉన్నారని తెలిసి సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వంపై ఉద్యోగులకు ఉన్న వ్యతిరేకత ఉపయోగించుకునే పనిలో టిడిపి నాయకులు ఉన్నారు. మహిళా ,యువ ఓటర్లూ కీలకమేవిజయనగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు అనేది నిర్ణయించే శక్తి మహిళా ఓటర్ల చేతిలో కూడా ఉంది. మొత్తం 2,57,205 మంది ఓటర్లలో మహిళా ఓటర్లు 1,32,347 ఓట్లు ఉన్నాయి. అంటే పురుష ఓటర్లు కంటే మహిళా ఓటర్లు 8,478 మంది అధికంగా ఉన్నారు. దీంతో మహిళా ఓటర్లు విజేతలను నిర్ణయించే అవకాశం ఉంది. మరో వైపు యువకులు ఓట్లు కూడా మహిళా ఓటర్లు తర్వాత విజేతను నిర్ణయించే స్థానంలో ఉన్నారు. నియోజకవర్గంలో 30 ఏళ్ల లోపు ఓటర్లు 44,555 మంది ఉన్నారు. ఈనేపథ్యంలో వీరిపైనే అభ్యర్థుల భవితవ్యం ఆధారపడి ఉంది.

➡️