వైసిపి పాలనలో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకం

Apr 10,2024 22:01

ప్రజాశక్తి- బొబ్బిలి: వైసిపి పాలనలో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని టిడిపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన అన్నారు. స్థానిక సూర్య రెసిడెన్సీలో బుధవారం టిడిపి వాణిజ్య విభాగం నాయకులు సుంకరి సాయిరమేష్‌ అధ్యక్షతన యువ ఓటర్లతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా బేబినాయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. అవినీతిపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ నిలదీస్తే పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిగత జీవితంపై మాట్లాడడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో రాజకీయ విలువలు దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రోత్‌ సెంటర్‌లో పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడిందన్నారు. స్థానికులకు 80శాతం ఉద్యోగాలు ఇస్తామని చట్టం చేసిన వైసిపి ప్రభుత్వం మైతాన్‌ పరిశ్రమలో పని చేసిన పాతకార్మికులను అన్యాయంగా తొలగించిందన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర, యువత భవిష్యత్‌ కోసం టిడిపి, జనసేన, బిజెపి కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. తెలుగు ప్రొఫెషనల్‌ వింగ్‌ అద్యక్షులు తేజస్విని మాట్లాడుతూ వైసిపి పాలనలో యువత జీవితం నాశనం అవుతుందన్నారు. రాష్ట్ర యువత భవిష్యత్‌ కోసం కూటమిని గెలిపించాలన్నారు. యువ ఓటర్లు అడిగిన పలు ప్రశ్నలకు బేబినాయన సమాధానం చెప్పారు. కార్యక్రమంలో యువ ఓటర్లతో పాటు టిడిపి కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, పాల్గొన్నారు.టిడిపిలో 25 కుటుంబాలు చేరికపట్టణంలోని తారకరామకాలనీకు చెందిన 25 కుటుంబాలు వైసిపిని వీడి టిడిపి తీర్థం పుచ్చుకున్నాయి. వీరందరికి కూటమి అభ్యర్థి బేబినాయన కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టిడిపి కూటమి అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. అభివృద్ధి చేయడంలో వైసిపి విఫలమైందన్నారు. టిడిపి గెలుపునకు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.

➡️