భూ యాజమాన్య హక్కు చట్టం ప్రజల పాలిట శాపం

May 6,2024 00:39

మాట్లాడుతున్న విశ్రాంత ఐఎఎస్‌ డాక్టర్‌ పి.కృష్ణయ్య
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :
రాష్ట్ర ప్రభుత్వం భూ యాజమాన్య హక్కు చట్టంను అమలు చేస్తే ప్రజల పాలిట శాపంగా మారుతుందని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ పి. కృష్ణయ్య పేర్కొన్నారు. జనచైతన్య వేదిక హాలులో భూ యాజమాన్య హక్కు చట్టం అమలు పూర్వ పరాలు – సమస్యలు అనే అంశంపై ఆదివారం జరిగిన చర్చా గోష్టికి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. కృష్ణయ్య ప్రసంగిస్తూ చట్టంలో చెప్పిన నిర్దిష్ట కాలంలో లీజులు, తనఖాలు, ఇతర అన్యాక్రాంతాలు, క్రయ విక్రయాలను భూమి ఆస్తి హక్కు అధికారి వద్ద నమోదు చేయడంలో ఆస్తి యాజమానులు విఫలమైతే ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.50 జరిమానా విధించడాన్ని తీవ్రంగా ఖండించారు. భూ హక్కుల నిర్ధారణ, వివాదాల పరిష్కారాలను స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయస్థానాలను నుంచి తొలగించి ,ప్రభుత్వం వారి ఆధీనంలో ఉన్న వారి కనుసన్నలలో పనిచేసే రెవెన్యూ అధికారులకు పూర్తి అధికారాలను సంక్రమింప చేయటం ద్వారా అనేక కొత్త సమస్యలు ఉత్పన్నమౌతాయన్నారు. ప్రజల ఆస్తులను రక్షించాల్సిన ప్రభుత్వాలు వాటిని భక్షించే విధంగా నిబంధనలు కొత్త చట్టంలో పొందుపరచడం ఆక్షేపనీయమన్నారు. సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సిహెచ్‌. దివాకర్‌ బాబు ప్రసంగిస్తూ భూహక్కు కొత్త చట్టం దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల వారు, నిరీక్షరాస్యుల ప్రయోజనాలను దెబ్బ తీస్తుందన్నారు. లబ్ధిదారుల పేర్లలో మార్పులు, చేర్పులు సంబంధిత రిజిస్టర్‌ లో చేర్చినప్పుడు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కేవలం ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ప్రకటించి చేతులు దులుపుకోవడం హాస్వాస్పదమన్నారు. లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ప్రజలలో ఎలాంటి చర్చ జరపకుండా హడావుడిగా భూహక్కు చట్టమును తీసుకొని రావడాన్ని ప్రశ్నించారు. అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న రెవెన్యూ యంత్రాంగం చేతిలో భూహక్కు చట్టాన్ని ఉంచటం, న్యాయవ్యవస్థను దూరంగా ఉంచటం సహేతుకం కాదన్నారు. ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర రాజేంద్ర ప్రసాద్‌ ప్రసంగిస్తూ ఉన్నత న్యాయస్థానాలు భూహక్కు విషయాలలో ఇచ్చిన తీర్పులను ఏడు రోజులలో అధికారుల వద్ద నమోదు చేసుకోకపోతే ఆ తీర్పులను అంగీకరించ లేమని పేర్కొనడం రాజ్యాంగ స్పూర్తికి విఘాతం కల్గిస్తుందన్నారు. హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసులు ప్రసంగిస్తూ ప్రపంచ బ్యాంక్‌ ఆదేశాల కనుగుణంగా నీతి ఆయోగ్‌ రూపొందించిన నమూనా చట్టానికి మరిన్ని కఠిన నిబంధనలు పొందుపరిచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భూ హక్కు చట్టాలను రూపొందిం చడాన్ని అన్ని వర్గాల ప్రజలు నిరసించాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పౌర హక్కుల సంఘం నేత పి రాజారావు, ప్రోగ్రెసివ్‌ ఫోరం నేత పి వి మల్లికార్జునరావు, మానవత చైర్మన్‌ పావులూరి రమేష్‌, రేటు పేయర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు ఓ.నారాయణరెడ్డి, విద్యావేత్త ప్రొఫెసర్‌ డిఏ ఆర్‌.సుబ్రహ్మణ్యం, బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షులు కెవికె సురేష్‌, సిహెచ్‌.రవీంద్రబాబు, చుక్కపల్లి రమేష్‌, హైకోర్టు న్యాయవాది వివి లక్ష్మీనారాయణ ప్రసంగించారు.

➡️