రహదారి ఇలా.. మరి ప్రయాణం ఎలా ?

Jun 19,2024 22:17

ప్రజాశక్తి – కురుపాం :  మండలంలో గిరిశిఖర పంచాయతీ జరడ గ్రామానికి వెళ్లే బిటి రహదారి అధ్వానంగా తయారైంది. పూర్తిగా గుంతలు, రాళ్లు తేలిన రహదారితో గిరిశిఖర గ్రామాల గిరిజనులు నరకయాతన అనుభవిస్తున్నారు. నీలకంఠాపురం పంచాయతీ నుండి జరడ గ్రామానికి సుమారు 10 కిలోమీటర్ల దూరం. ఈ రహదారి పొడవునా గుంతలు ఏర్పడి, రాళ్లు తేలాయి. పంచాయతీకి ఆనుకొని సుమారు 9 గ్రామాలు ఉన్నాయ. ఏ అవసరమైనా, నిత్యావసర సరుకులు కొనుక్కో వాలన్నా నీలకంఠాపురం గ్రామానికి వారంతా వెళ్లాలి. రహదారి బాగున్నప్పుడు ఆటోలు, జీపులు తిరిగేవి. రహదారి పాడైపోవడంతో వాహనాలు తిప్పడంలేదు. ద్విచక్ర వాహనం కూడా చాలా కష్టంగా వెళుతుందని గిరిజనులు చెబుతున్నారు. అత్యవసర సమయంలో 108 వాహనం కూడా రాలేదని వాపోయారు. డోలిమోత ద్వారా నీలకంఠాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే అధికారులు స్పందించి రహదారి సదుపాయం కల్పించాలని కోరుతున్నారు.

➡️