సిపిఎం నేత భరద్వాజ్‌ సేవలు ఎనలేనివి : సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం

ప్రజాశక్తి -భీమవరం (పశ్చిమ గోదావరి) : తుది శ్వాస విడిచే వరకు మిలటరీ క్రమశిక్షణతో పేద ప్రజల అభ్యున్నతికి సిపిఎం నేతగా పనిచేసిన భరద్వాజ్‌ సేవలు ఎనలేనివని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం, జిల్లా సెక్రటేరియట్‌ సభ్యులు జెఎన్వి.గోపాలన్‌ అన్నారు. వత్సవాయి భరద్వాజ 30వ వర్ధంతి సభ భీమవరం శ్రీ వైభవ్‌ అపార్ట్‌మెంటులో ఆయన నివాసంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా భరద్వాజ్‌ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బలరాం, గోపాలన్‌ మాట్లాడుతూ … సైన్యంలో పనిచేసి రిటైర్మెంట్‌ అనంతరం నరసాపురం తాలూకాలో ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గని అందరి మన్ననలు పొందారని అన్నారు. భరద్వాజ లేని లోటు సిపిఎం ఉద్యమానికి తీరని లోటు అని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కం శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ …. సమయపాలన విషయంలో పేదల సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటాల విషయంలో ఉక్కు క్రమశిక్షణతో రాజీలేని పోరాటాలు నిర్వహించారన్నారు. ఆచంటలో భరద్వాజ పేరుతో ప్రజా ఉద్యమాల కేంద్రంగా కార్యాలయ నిర్మాణం జరిగిందన్నారు. ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భరద్వాజ భార్య వత్సవాయ సత్యవతి కుటుంబ సభ్యులు కలిదిండి రాధా, వ్యవసాయ కార్మిక సంఘం మహిళా నాయకురాలు జె.వెంకటలక్ష్మి లు పాల్గొన్నారు.

➡️