ప్రశాంతంగా ఓట్ల లెక్కింపే కర్తవ్యం

May 20,2024 23:33

మాట్లాడుతున్న పల్నాడు కలెక్టర్‌ శ్రీకేష్‌ లత్కర్‌
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే ప్రస్తుతం తమ ముందున్న కర్తవ్యమని పల్నాడు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికలాధికారి లత్కర్‌ శ్రీకేష్‌ బాలాజీరావు అన్నారు. కలెక్టర్‌గా ఆదివారం బాధ్యతలు చేపట్టిన ఆయన పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టరేట్‌లో సోమవారం విలేకర్లతో మాట్లాడారు. 4వ తేదీన నరసరావుపేట మండలంలోని జెఎన్‌టియు కళాశాలలో నిర్వహించే ఓట్ల లెక్కింపై సంబంధిత అధికారులకు త్వరలో శిక్షణిస్తామని చెప్పారు. 4న ఉదయం 8 గంటలకు పార్లమెంట్‌ స్థానంతోపాటు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని, తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు ఉంటుందని చెప్పారు. పార్లమెంట్‌ స్థానంతోపాటు 7 నియోజకవర్గాలకు సంబంధించి 7+7 మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్‌ కేంద్రంలో 196 టేబుల్‌ ఏర్పాటు చేస్తామన్నారు. కౌంటింగ్‌లో 700 మందికి పైగా సిబ్బంది పాల్గొంటారన్నారు. కౌంటింగ్‌ టేబుల్‌, ఒక పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు టేబుల్‌ ఏర్పాటు చేస్తామని, ప్రతి టేబుల్‌ వద్ద కౌంటింగ్‌ సూపర్వైజర్‌ కౌంటింగ్‌ అసిస్టెంట్‌, మైక్రో అబ్జర్వర్‌ బృందంగా పని చేస్తారని తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు బృందాలు అందుబాటులో ఉంటాయన్నారు. కౌంటింగ్‌ కేంద్రానికి వచ్చే సిబ్బందికి గుర్తింపు కార్డు మంజూరు చేస్తామని, వారు దాన్ని తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుందని చెప్పారు. కలెక్టర్‌ వెంట జాయింట్‌ కలెక్టర్‌ ఏ.శ్యాంప్రసాద్‌, జిల్లా రెవెన్యూ అధికారి కె.వినాయకం ఉన్నారు.త్వరగా ఛార్జిషీట్‌ వేసేలా చర్యలుఎన్నికల ఘర్షణలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని, వీటిని ప్రేరేపించిన వారిని గుర్తించి బైండోవర్‌ చేయడంతో పాటు త్వరగా ఛార్జిషీట్‌ వేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ అన్నారు. పోలింగ్‌ రోజున పల్నాడు జిల్లాలో 27 ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలతో జిల్లా మొత్తానికి చెడ్డ పేరు వచ్చిందన్నారు. ఓట్ల లెక్కింపు రోజున ఇవి పునరావృతం కాకుండా పోలీసులను అప్రమత్తం చేస్తామని, అనుమానితులను బైండోవర్‌ చేస్తామని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా 144 సెక్షన్‌ అమలుతో పాటు ప్రత్యేక భద్రతా చర్యలు చేపడతామన్నారు. కౌంటింగ్‌ అనంతరం కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కొనసాగుతుందన్నారు.

➡️